గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 20, 2020 , 23:12:22

మండల సభ గరంగరం

మండల సభ గరంగరం

  • రైతుబీమాపై ఏవోను నిలదీసిన జడ్పీ వైస్‌ చైర్మన్‌ 

జిన్నారం : మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. రైతుబీమా, కరెంట్‌ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై సభ్యులు అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ సూచించారు. శనివారం ఎంపీపీ రవీందర్‌గౌడ్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండల సభలో రైతుబీమాపై నలభై నిమిషాలపాటు చర్చ జరిగింది. ఏవో రవీంద్రనాథ్‌రెడ్డిని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఊట్ల సర్పంచ్‌ ఆంజనేయులుతో పాటు ఇతర గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నిలదీశారు. ఊట్ల గ్రామానికి చెందిన పూజారి వీరేశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే రైతుబీమా ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. 2017లో తాను లేనని, అదే విషయాన్ని అధికారులకు రిపోర్టు ఇచ్చానని ఏవో తెలిపారు. గతంలో ఆత్మహత్యలు జరిగిన దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంతో త్రిసభ్య కమిటీ ఫైల్‌పై సంతకం చేయడం లేదని జడ్పీటీసీ మండిపడ్డారు. దీంతో మండల సభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఫైల్‌పై సంతకం చేస్తానని ఏవో తెలిపారు. జిన్నారం, జంగపేట, పెద్దమ్మగూడెం గ్రామాల్లో కరెంట్‌ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఏఈ దృష్టికి ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌ తీసుకెళ్లారు.  ఊట్లలో పొలాల వద్ద వేలాడుతున్న కరెంట్‌ వైర్లను రైతులే స్తంభాలు ఎక్కి బాగు చేసుకుంటున్నారని వైస్‌ ఎంపీపీ గంగురమేశ్‌ ఏఈకి ఫొటోలు చూపించారు. ఖాజీపల్లి, సోలక్‌పల్లి గ్రామాల్లో కరెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేసి ఇంతవరకు వైర్లు ఏర్పాటు చేయలేదని ఎంపీటీసీ స్వాతి, సర్పంచ్‌ సత్యనారాయణ తెలిపారు. 

రెండు మండలాలుగా ఏర్పాటైనా..

జిన్నారం, గుమ్మడిదల రెండు మండలాలుగా ఏర్పడినా జిన్నారం మండలంలోని వావిలాల, గడ్డపోతారం పంచాయతీల గ్రామాలకు ఇంకా గుమ్మడిదల పీహెచ్‌సీ పరిధిలోనే ఉండడంతో వైద్య సేవలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ ప్రకాశ్‌చారి, సుశాంతి సభలో వెల్లడించగా జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ సభలో నుంచే డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఆర్డర్‌ కాపీ ఇచ్చినా ఇంకా ఎందుకు మార్చలేదని అడిగారు. పెద్దమ్మగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి వర్షం నీరు చేరిందని మట్టి వేసి బాగు చేయాలని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌ కోరారు. అనంతరం జడ్పీ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా చెప్పని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముందుంటారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరథ్‌, ఎంపీడీవో సుమతి, వైస్‌ ఎంపీపీ గంగురమేశ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.  logo