ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 20, 2020 , 23:12:17

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

  • మండల సర్పంచుల ఫోరం 
  • అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి
  • గ్రామాల్లో చెత్త బుట్టల పంపిణీ

రాయికోడ్‌ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సంగాపూర్‌లో గ్రామస్తులకు ఉచితంగా చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సమస్యలు పట్టించుకునే వారు లేక గ్రామాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారేవని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నదన్నారు. గ్రామాలకు అవసరమయ్యే డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలను ప్రభుత్వం ఏర్పా టు చేసిందని తెలిపారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్‌గౌడ్‌, ఎంపీటీసీ లక్ష్మీసుభాష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నగేశ్‌, పంచాయతీ కార్యదర్శి సుప్రియ పాల్గొన్నారు. 

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

హత్నూర : ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఎంపీపీ నర్సింహులు అన్నారు. శనివారం హత్నూర మండలం లింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన డంపింగ్‌యార్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు వేసి సేంద్రియ ఎరువుల తయారీకి కృషి చేయాలని చెప్పారు. హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీమాణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ దుర్గయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. 

పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలి

వట్‌పల్లి : ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని వట్‌పల్లి ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం మేడుకుందలో పరిసరాల పరిశుభ్రతపై గ్రామ సమైఖ్య సంఘాలకు, స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం లోపించకుండా ఉండేందుకు తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. వానకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై వారితో ప్రతిజ్ఞ చేయించి చెత్త బుట్టలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గంగాబాయి, పంచాయతీ కార్యదర్శి హైమద్‌, సమైఖ్య సంఘాల మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

పుల్కల్‌ : ప్రతిఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేయాలని చౌటకూర్‌ గ్రామ సర్పంచ్‌ కొల్కూరి వీరమణి మహిళలకు సూచించారు. శనివారం గ్రామ పంచాయతీలో మహిళలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చెత్త సేకరణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి ఆశాలత, కారోబార్‌ జాఫర్‌ పాల్గొన్నారు. 

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి 

రాయికోడ్‌ : గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్‌గౌడ్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని మహిబాత్‌పూర్‌లో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరు చేసిందన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమావేశంలో సర్పంచ్‌ నాగమ్మ, పంచాయతీ కార్యదర్శి అమూల్య తదితరులు పాల్గొన్నారు. 


logo