మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jun 20, 2020 , 22:57:15

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

  • మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌: మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన ఆయా పనులతో పాటు రూర్బన్‌ స్కీం కింద పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని పాపన్నపేట మండలంలో జరుగుతున్న పనులు, ఆయా గ్రామాలు, పట్టణాలు, మండల, జిల్లా కేంద్రాల్లో సీసీ రోడ్లు, కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లో పనులతో పాటు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు ఎలాంటి ఇసుక కొరత లేకుండా చూడాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం పనులు ఎంత వరకు వచ్చాయి..? ఎప్పటికీ పూర్తవుతాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ భవనాల నిర్మాణాల్లో ఇబ్బందులుంటే సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని డీపీవో హనోక్‌ను ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని అయినప్పటికీ మార్పు రాకపోతే కాంట్రాక్టర్లను మార్చాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, అదనపు గదుల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని డీఈవో రమేశ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులకు ఎలాంటి కొరత లేదని అధికారులందరూ పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. 

హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలి

అందరి సహకారంతో హరితహారాన్ని విజయవంతం చేసి, జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలోని గ్రామాలు, తండాలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర  మొక్కలు నాటాలని ఆకాంక్షించారు. ఈసారి వంద శాతం మొక్కలు బతికేలా ప్రణాళికలు రూపొందించుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌, డీపీవో హనోక్‌, డీఏవో పరశురాం, డీఈవో రమేశ్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

మెదక్‌ రూరల్‌ : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. శనివారం మెదక్‌ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధి నర్సరీని జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో 48 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నర్సరీల్లో మొత్తం 70 రకాల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో రాంబాబు, ఏపీవో ఆది నారాయణ, వైస్‌ ఎంపీపీ  అంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎలక్షన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.logo