బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jun 19, 2020 , 23:52:50

నేషనల్‌ హైవేలకు నిధులు

నేషనల్‌ హైవేలకు నిధులు

n  బీహెచ్‌ఈఎల్‌, ఇస్నాపూర్‌లో జంక్షన్లు  

n  సంగారెడ్డి జిల్లాలో 1447 ‘డబుల్‌' ఇండ్లు n   సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో ఉన్న జాతీయ రహదారులకు నిధులు విడుదల చేసినట్లు  మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో జాతీయ రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, నియంత్రిత సాగుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు, ఫ్లైఓవర్ల బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు చెప్పారు. ఎన్‌హెచ్‌ 161 నాందేడ్‌-అకోలా రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుపై ఉన్న గుడి, మసీదులను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణఖేడ్‌-బీదర్‌ జాతీయ రహదారి 161-బీ రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. నేషనల్‌ హైవే 765-డీ నర్సాపూర్‌ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని, పోతంశెట్టిపల్లి వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఎన్‌హెచ్‌-65 ముంబై హైవేపై బీహెచ్‌ఈఎల్‌ వద్ద ట్రాఫిక్‌ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇస్నాపూర్‌ జంక్షన్‌ వద్ద ఆరు లేన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 18కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. జాతీయ రహదారిపై పోతిరెడ్డిపల్లి నుంచి జహీరాబాద్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్క లు నాటాలని కలెక్టర్‌ హనుమంతరావుకు సూచించారు. జిల్లాకు 116 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా రైతు వేదికల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. మూడు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయాలన్నారు. డబుల్‌బెడ్‌ రూం ఇండ్లపై సమీక్షిస్తూ జిల్లాలో 1447 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, జూలై మొదటి వారంలో, 15వ తేదీన , 30వ తేదీన ప్రారంభం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు నియంత్రిత సాగుకు జిల్లా రైతులు అనుకూలంగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు.  జిల్లాలోని 647 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయని, జూలై 15 నాటి 100శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 388 శ్మశాన వాటికలు, 223 డంపింగ్‌ యార్డులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎంపీలు బీబీపాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, జడ్పీ సీఈవో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.logo