ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 19, 2020 , 00:39:26

బాలికలదే పైచేయి

బాలికలదే పైచేయి

ఇంటర్‌ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. సిద్దిపేట జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 53 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 56.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెదక్‌ జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 36శాతం, ద్వితీయ సంవత్సరంలో 42శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా 11వ స్థానంలో నిలువగా, సంగారెడ్డి జిల్లా 14వ స్థానంలో ఉండగా, మెదక్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట రూరల్‌ : గురువారం వెలువడిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లాలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లా 11వ స్థానంలో ఉంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణత 53శాతం ఉండగా, మొత్తం 11,316 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 5,964 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలో 62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 10,498 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 6,554 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో 11 వ స్థానంలో నిలిచింది. గతేడాది సిద్దిపేట జిల్లా ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాలలో16 వ స్థానంలో ఉండగా, ద్వితీయ సంవత్సర ఫలితాలలో 15 వ స్థానం నిలిచింది.  

కొనసాగిన బాలికల హవా..

ఇంటర్‌ ఫలితాలలో జిల్లాలో బాలికలు మంచి ప్రతిభ కనబర్చి సత్తా చాటుకున్నారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలురు 5,293 మంది పరీక్షకు హాజరు కాగా 2,042 మంది పాసై 39 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6,023 మంది పరీక్షకు హాజరు కాగా 3,922 మంది విద్యార్థులు పాసై ఉత్తీర్ణత శాతం 65 శాతం నమోదైంది. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలలోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలురు 4,699 మంది పరీక్షకు హాజరు కాగా 2,289 మంది విద్యార్థులు పాసై 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,799 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 4,265 మంది పాసై 74 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

జనరల్‌, ఒకేషనల్‌ రెండింటిలోనూ బాలికలదే హవా..

ఈ సంవతర్సం ఇంటర్‌ జనరల్‌ విభాగంలో ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలురు మొత్తం 3,363 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1511 మంది పాస్‌ అయి 44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 4,667 మంది విద్యార్థులు హాజరు కాగా 3,141 మంది పాస్‌ అయి 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా జనరల్‌ విభాగంలో 8,030 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 4,652 మంది విద్యార్థులు పాసు కాగా 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జనరల్‌ విభాగంలో మొత్తం 7,612 మంది విద్యార్థులు హాజరు కాగా 5,139 మంది పాస్‌ అయి 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అందులో బాలురు 3,018 మంది పరీక్షలు రాయగా 1,660 మంది విద్యార్థులు పాసై 55 శాతం ఉత్తీర్ణత కాగా, బాలికలు 4,594 మంది పరీక్షకు హాజరు కాగా 3,479 మంది పాసు కాగా 75 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో బాలురు 1,930 మంది విద్యార్థులు హాజరు కాగా 531 మంది పాసై 27 శాతం ఉత్తీర్ణత ఉండగా.. బాలికలు 1,356 మంది హాజరు కాగా 781 విద్యార్థులు పాసై 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో బాలురు 1,681 మంది విద్యార్థులు హాజరు కాగా 629 మంది పాసై 37 శాతం ఉత్తీర్ణత ఉండగా.. బాలికలు 1,205 మంది హాజరు కాగా 786 విద్యార్థులు పాసై 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.  దీన్ని బట్టి చూస్తే జనరల్‌, ఒకేషనల్‌ రెండింటిలోనూ బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.  

మెదక్‌ జిల్లాలో..

మెదక్‌ : ఇంటర్‌ ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు సత్తాచాటారు. గురువారం ఒకేసారి విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 36 శాతం, ద్వితీయ సంవత్సరంలో 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో బాలురు 3,587 మంది పరీక్షలు రాయగా, 980 మంది  ఉత్తీర్ణులయ్యారు. 27 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4113 మంది  పరీక్షలకు హాజరుకాగా, 1773 మంది ఉత్తీర్ణులై 43శాతం సాధించారు. మొత్తం 7,700 మంది విద్యార్ధులకు గాను 2,753 మంది ఉత్తీర్ణులయ్యారు. 36 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2,729 మంది   పరీక్షలు రాయగా, 1053 మంది ఉత్తీర్ణులై, 39 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3311 మంది పరీక్షలు రాయగా, 1765 మంది పాసయ్యారు. 53 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,040 మంది విద్యార్ధులకు గాను 2818 మంది ఉత్తీర్ణులయ్యారు. 47శాతం ఉత్తీర్ణత సాధించారు. 

జనరల్‌ ప్రథమ సంవత్సరంలో...

బాలురు 3133 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా, 831 మంది పాసై , 26 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3860 మంది పరీక్షలకు హాజరుకాగా, 1614 మంది ఉత్తీర్ణులయ్యారు. 41 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,993 మంది విద్యార్ధులకు గాను 2445 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 34 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్‌ ద్వితీయ సంవత్సరంలో బాలురు 2,394 మంది పరీక్షలు రాయగా, 901 మంది ఉత్తీర్ణులై, 37శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3144 మందికి గాను 1653 మంది ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఉతీర్ణత సాధించారు. మొత్తం విద్యార్ధులు 5538 మంది విద్యార్ధులకు గాను 2554 మంది ఉత్తీర్ణులయ్యారు. 46శాతం ఉత్తీర్ణత సాధించారు. 

రీ కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ దరఖాస్తుకు 24 వరకు గడువు..

విద్యార్థులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 24 వరకు అవకాశం కల్పించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డీఐఈవో) సూర్యప్రకాశ్‌ తెలిపారు. రీ కౌంటింగ్‌కు ప్రతి పేపర్‌కు రూ.100, రీ వెరిఫికేషన్‌, పరీక్ష రాసి పేపరును జిరాక్స్‌ కోసం ఒక పేపరుకు రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు. tsdie.tgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

నిరాశ పరిచిన ఫలితాలు...

ఇంటర్‌ ఫలితాలు ఈసారి నిరాశ పరిచాయి. రెండో సంవత్సరం ఫలితాలు 42 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం విద్యార్ధులు కూడా 36 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అంటే పరీక్షలు రాసిన వారిలో సగం మంది కూడా గట్టెక్కలేకపోయారు. ఇదిలావుండగా జనరల్‌ ప్రథమ స్థానంలో 34 శాతం, జనరల్‌ ద్వితీయ స్థానంలో 49 శాతం మాత్రమే సాధించారు. గత రెండు సంవత్సరాలుగా మెదక్‌ జిల్లా 18, 24వ స్థానాల్లో ఉండగా, ఈ ఏడాది చివరి స్థానానికి పడిపోయింది.

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి టౌన్‌ : మొదటి సంవత్సరం జనరల్‌ కేటగిరీలో 14,790 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 8,305 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా జిల్లా 56శాతం ఉత్తీర్ణత సాధించింది. బాలురు ఫస్టియర్‌లో 7,334 మంది పరీక్షలు రాయగా.. 3949 మంది పాసయ్యారు. బాలికలు 7,456 మంది పరీక్షలు రాయగా.. 4,356 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 1,273 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ..672 మంది పాసయ్యారు. రాష్ట్రంలో 20వ స్థానంలో జిల్లా నిలిచింది. 

ద్వితీయ సంవత్సరంలో...

సెకండియర్‌లో జనరల్‌ కేటగిరీలో జిల్లాలో 12,703 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 8,058 మంది విద్యార్థులు పాసయ్యారు. బాలురు 6,736 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,250 మంది ఉత్తీర్ణత సాధించారు. 63శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 5,967 మంది పరీక్షలు రాయగా.. అందులో 3,808 మంది ఉత్తీర్ణులయ్యారు. 63శాతంతో బాలురు, బాలికలు ఇద్దరు సమాన ఉత్తీర్ణత సాధించారు. 


logo