ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 17, 2020 , 23:49:30

ఉపాధిలో జిల్లా మేటి..

ఉపాధిలో జిల్లా మేటి..

l రాష్ట్రస్థాయిలో సంగారెడ్డి జిల్లాకు  ద్వితీయ స్థానం

l 48.11 లక్షల పనిదినాల కల్పనతో టాప్‌

l కొత్త జాబ్‌కార్డుల జారీలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమస్థానం

l జిల్లాలో 2.80 లక్షల జాబ్‌ కార్డులు..  1.40 లక్షల కూలీలు

l ప్రస్తుతం పనికి హాజరవుతున్నది 75వేల మంది..

సంగారెడ్డి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో అధిక పనిదినాల కల్పనతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలో జూన్‌ నాటికి 48.11 లక్షల పనిదినాలు కల్పించారు. కొత్త జాబ్‌కార్డుల జారీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం మరో విశేషం. జిల్లాలో 2.80 జాబ్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 75వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధిహామీ పనిలో అత్యధిక దినాలు పనిచేయడంతో ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాదికంటే 50శాతం అధికంగా 1.40 లక్షల మందికి ఉపాధి కల్పించి జిల్లా రాష్ట్రంలో 107.45 శాతంతో రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచింది. మెదక్‌ జిల్లా 94.44 శాతం, సిద్దిపేట జిల్లా 80.44 శాతం సాధించాయి. కొత్త జాబ్‌ కార్డులు 13 వేలు జారీచేసి రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అత్యధిక పనిదినాలు పూర్తిచేయడంతో సంగారెడ్డి జిల్లాకు రూ.80 కోట్ల నిధులు ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో సీసీరోడ్లు, గేదెలు, గొర్రెల పెంపకం షెడ్లు, హరిత పందిరి సాగుకు నిధులు ఖర్చుపెడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లు చేపడుతుండడంతో గ్రామాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తుండడంతో పాడిరైతులు, గొర్రెల పెంపకందారులకు మేలు జరగనుంది.  

జాబ్‌కార్డుల జారీలో ప్రథమ స్థానం..

కొత్త కూలీలకు సంబంధించి జాబ్‌కార్డుల జారీలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాకు ప్రథమస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేసేందుకు ఆసక్తి కలిగిన కూలీలు 13,017 మందికి జాబ్‌ కార్డులు జారీ చేయడం కూడా పనిదినాలు పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో 2.80 జాబ్‌కార్డులు ఉన్నాయి. కూలీలకు అత్యధికంగా రూ. 156 నుంచి రూ. 237 వరకు వేతనం లభించింది. 

గొర్రెల షెడ్లకు నిధులు..

ఆసక్తి ఉన్న గొర్రెల పెంపకందారులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నారు. 34 గొర్రెల షెడ్ల నిర్మాణానికి కూలీలకు రూ. 26,362, సామగ్రికి రూ. 10,32,146 , మొత్తం రూ. 10,58,508 నిధులు ఖర్చు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రెండు గొర్రెల షెడ్లు నిర్మాణం పూర్తి అయ్యాయి. వీటికి రూ. 71,661 నిధులు ఖర్చు చేసినట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గొర్రెల షెడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారి నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 

రాష్ట్రంలో రెండో స్థానం..

ఉపాధిహామీ పథకంలో అత్యధిక పనిదినాలు కల్పించి రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.  భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయిస్తున్నాం.  ఈ నిధులను గ్రామాల్లో సీసీ రోడ్లు, గేదెలు, గొర్రెల షెడ్లు, హరితపందిరి నిర్మాణాలకు ఖర్చుచేస్తున్నాం.

- శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో, సంగారెడ్డి


logo