గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jun 17, 2020 , 00:23:00

ఆరోగ్యకర సమాజమే లక్ష్యంగా..

 ఆరోగ్యకర సమాజమే లక్ష్యంగా..

l సేంద్రియ సాగు చేస్తున్న యువరైతు తిరుపతి  

l దేశీయ విత్తనాలతో అధిక దిగుబడులు

తొగుట : ప్రకృతి సాగే ప్రాణంగా యువరైతు జక్కుల తిరుపతి ఏరువాక సాగుతున్నాడు. నార్మన్‌ బోర్లాంగ్‌ హరిత విప్లవం పుణ్యమా అని హైబ్రిడ్‌ వంగడాలు రావడం, రసాయన ఎరువుల వినియోగం పెరుగడంతో ఎవుసంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో పోషక విలువలు పడిపోయి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని రైతు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కింద తన తండ్రి రాజయ్య క్యాన్సర్‌తో మృతి చెందడంతో దేశీయ వరి వంగడం ‘కాలాబట్టి’ విత్తనం లింగాపూర్‌లో తన మామ బిక్కునూరి భిక్షపతి పొలంలో సాగుచేశాడు.  

ఆంధ్రాలో సాగుచేసి సత్ఫలితాలు... 

తిరుపతి మొదట్లో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసేవాడు. విజయవాడలో సేంద్రియ ధాన్యం షాపులో పని చేశాడు. ఆంధ్రాకు చెందిన బాపన్న, అక్బర్‌ ద్వారా సుభాష్‌ పాలేకర్‌, రాజీవ్‌ దీక్షిత్‌ స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ‘సేవ్‌ ఫౌండేషన్‌' భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌కు చెందిన వారు శివప్రసాద్‌ రాజు, విజయరామ్‌ దగ్గర విత్తనాలు తీసుకొని ఆంధ్రా, తెలంగాణలో రైతులతో సాగుచేయిస్తూ దేశీయ విత్తనాలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్‌లో సిద్దిపేటలో విత్తన బ్యాంక్‌ ఏర్పాటు చేసి, దేశీయ విత్తనాలను కాపాడుకోవడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని తిరుపతి పేర్కొన్నారు.

సేంద్రియ ధాన్యానికి డిమాండ్‌...

దేశవాళీ ధాన్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. నల్లవడ్లలో మంచి పోషకాలు ఉండడంతో మార్కెట్‌లో కిలోకు రూ.250-300 వరకు ధర పలుకుతున్నది. మన పూర్వీకుల సాగుచేసిన రాగులు, సజ్జలు, కొర్రలను నేడు మళ్లీ తింటున్నారు. ప్రతి రైతు ఆవులను పెంచుకోవాలి. సేంద్రియ సాగుపై రైతులు దృష్టిసారించాలి.  సేంద్రియ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు 9000269724లో సంప్రదించవచ్చని యువరైతు తిరుపతి సూచిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయానికి జీవం పోస్తున్న అతడు నేటి తరానికి ఆదర్శ ప్రాయుడే.

యూరియా లేకుండానే...

పూర్వం ఎలా సాగుచేసే వారో.. అదే పద్ధతిని అనుసరించాడు తిరుపతి. పొలంలో ముందుగా ఆకులు, అలం, పశువుల పేడవేసి కలియదున్నాడు. నాటువేశాక 10కిలోల ఆవుపేడ, 10లీటర్ల ఆవుమూత్రం, 2కిలోల చొప్పున శనిగపిండి, బెల్లం, పిడికెడు మట్టిని కలిపి ఒక డ్రమ్‌లో వేసి జీవామృతాన్ని తయారు చేశాడు. 15 రోజులకోసారి పొలంలో పిచికారీ చేశాడు. లింగాపూర్‌లో దేశీయ రకాలైన ‘కాలాబట్టి’, ‘చింతలూరి’ సన్నం వరి వంగడాలను అర ఎకరంలో సాగుచేశాడు. వీటిలో కాలాబట్టి వరి రకం నల్లగా ఉంటుంది. బియ్యం సైతం నల్లగా ఉంటాయి. వీటిలో క్యాన్సర్‌ను నివారించే బీ6, బీ12 విటమిన్లు అధికంగా ఉంటాయని ఆయన తెలిపారు.  logo