బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jun 15, 2020 , 23:33:36

బడి నిర్మాణం మహా అద్భుతం

బడి నిర్మాణం  మహా అద్భుతం

  • n జీ+2 విధానంలో పూర్తయిన నూతన భవనం
  • n ఒకే భవనంలో బడి, కళాశాల నిర్మాణం
  • n త్వరలో అందుబాటులోకి రానున్న సరస్వతీ నిలయం

‘ఈ గడ్డ మీద పుట్టి పెరిగి.. విద్యాబుద్ధులు నేర్చుకొని సీఎం స్థాయికి వెళ్లినా.. ఏమిచ్చి ఈ నేల రుణం తీర్చుకోవాలి’ అని దుబ్బాక పర్యటనలో సీఎం కేసీఆర్‌ అన్న మాటలకు తగ్గట్టుగా తాను చదువుకున్న పాఠశాల భవనాన్ని మహాఅద్భుతంగా నిర్మించారు. దేశంలోనే దుబ్బాక పాఠశాల రోల్‌మోడల్‌గా నిలువనున్నది. 

దుబ్బాక టౌన్‌  : చిన్ననాడు చదువుకున్న బడి శిథిలావస్థకు చేరడంతో అద్భుతంగా పునర్నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.. అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే రామలింగారెడ్డిని ఆదేశించారు. అందుకు అనుగుణంగా రూ.10కోట్లతో పాఠశాల భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ముందుగా రూ.6కోట్లతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు దుబ్బాకకు వచ్చిన సీఎం కేసీఆర్‌ బడి పక్కనే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాన్ని చూశారు. దీంతో పాఠశాల, కళాశాల రెండు కలిపి ఒకే భవనంలో ఉండేలా నిర్మాణం చేపట్టాలని రూ.10కోట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో అద్భుతమైన నమూనాను రూపొందించిన అధికారులు సీఎం కేసీఆర్‌ అనుమతితో 20,700ల ఫీట్ల వైశాల్యంతో బడి నిర్మాణం చేపట్టారు. కరోనా వైరస్‌ మూలంగా కొంత ఆలస్యమైనప్పటికీ భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించి ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేలా అధికారులు, ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. 

కార్పొరేట్‌కు దీటుగా అధునాతన సౌకర్యాలు.. 

కార్పొరేట్‌కు దీటుగా అధునాతన సౌకర్యాలు భవనాన్ని నిర్మించారు. జీ+2 విధానంలో నిర్మించిన ఈ భవనంలో ఓ వైపు పాఠశాల, మరో వైపు కళాశాల నిర్వహణ కోసం తరగతి గదులను ఏర్పాటు చేశారు. 27 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో విశాలమైన 48తరగతి గదులను నిర్మించారు. ఒక్కో గదిలో సుమారు 60మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసించే వీలుంటుంది. వీటితో పాటు నాలుగు ప్రయోగశాలలు, కంప్యూటర్‌ గది, స్టాఫ్‌ రూములు, టాయిలెట్లు, కన్వెన్షన్‌హాల్‌ను నిర్మించారు. డైనింగ్‌హాల్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి గది, కళాశాల ప్రిన్సిపాల్‌ గదిని మోడ్రన్‌టైల్స్‌తో నిర్మించారు. మినరల్‌ వాటర్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బడి ప్రాంగణంలో పెద్ద ఎత్తున గ్రీనరిని ఏర్పాటు చేయబోతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశంలోనే దుబ్బాకలో సీఎం కేసీఆర్‌ చదివిన బడి ఓ రోల్‌ మోడల్‌గా నిర్మించడంపై చిన్ననాటి మిత్రులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

దుబ్బాక బడికి ఘనమైన చరిత్ర..

దుబ్బాకలోని సీఎం కేసీఆర్‌ చదివిన బడికి ఘనమైన చరిత్ర ఉంది. సుమారు 60ఏండ్లకు పైగా చరిత్ర గల ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నతులుగా ఎదిగారు. రాజకీయంగా, విద్య, వైద్య రంగాలతో పాటు పలు రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 1965-70 మధ్య కాలంలో ఇదే బడిలో పాఠశాల విద్య చదివిన కేసీఆర్‌ నేడు సీఎం స్థాయికి చేరుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సైతం ఇదే పాఠశాల భవనంలో షిప్ట్‌ విధానంలో నడిచిన జూనియర్‌ కళాశాలలో విద్యనభ్యసించారు.   

సీఎం కేసీఆర్‌ది ఉక్కు సంకల్పం..

దుబ్బాకలో తను చదువుకున్న బడిని దేశంలోనే అత్యాధునిక హంగులతో నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ ఉక్కు సంకల్పం నెరవేరింది. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రాంతమంటే అమితమైన ప్రేమ. దుబ్బాకలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే బడి భవనంలో ఇంటర్‌ చదివాను. అద్భుత పాఠశాల నిర్మాణం దుబ్బాక ప్రజల అదృష్టం. నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యేlogo