శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 23:49:45

మరో 65,859 మందికి..

మరో 65,859 మందికి..

  • కొత్తగా దరఖాస్తు చేసుకున్న  పట్టాదారులకు రైతుబంధు
  • ఈ వానకాలం నుంచే వీరికి వర్తింపు 
  • కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ
  • త్వరలో ఖాతాల్లో జమకానున్న డబ్బులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాసుపుస్తకాలు పొందిన పట్టాదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. వాటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నది. జూన్‌ 2019 కంటే ముందు పట్టా పాసుపుస్తకాలు ఉన్న రైతులకు రైతుబంధు అందుతున్నది. ఆ తర్వాత భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త పాసుపుస్తకాలకు సంబంధించి ఇంకా రైతుబంధు ఇవ్వడం లేదు. ఈ తర్వాత భూముల పట్టా పుస్తకాలు పొందిన వారికి కూడా రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు తమ వద్దకు వచ్చిన కొత్త పట్టాదారుల జాబితా ఆధారంగా, స్వయంగా రైతులకు ఫోన్లు చేసి ఆధార్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌, ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారు. 2019 జూన్‌ నుంచి 2020 జనవరి వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారిని ఇందుకు అర్హులుగా నిర్ణయించి వారి నుంచి వివరాలు సేకరించారు. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 65,859 మంది కొత్త పట్టాదారులు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వీరందరి నుంచి రైతుబంధు పథకానికి వివరాలు సేకరించారు. ఆ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏటా రెండు పంటలు (యాసంగి, వానకాలం) అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వానకాలం పెట్టుబడి సాయం త్వరలో ప్రభుత్వం అందించనుంది. కొత్త పట్టాదారులకు కూడా ఇక పెట్టుబడి సాయం అందనుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహరావు చెప్పారు. 


logo