సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jun 13, 2020 , 00:39:53

అందరికీ రైతుబంధు

అందరికీ రైతుబంధు

కొత్త పాస్‌ పుస్తకాలు 

పొందిన రైతులకు అవకాశం

సీసీఎల్‌ ధరణి 

వెబ్‌సైట్‌లో వివరాల నమోదు 

నేడు దరఖాస్తుకు ఆఖరు

మెదక్‌ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతు బంధుకు దరఖాస్తు చేసుకోవడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చిన వారు.. ఇంతకుముందు పాస్‌ పుస్తకాలు ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు 2018 సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించిన ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే 2019-20 వానకాలం నుంచి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇదిలాఉండగా మెదక్‌ జిల్లాలో చాలా మంది రైతులకు పాసు పుస్తకాలు లేకపోవడంతో ఇప్పటి వరకు రైతు బంధు వర్తించలేదు. దీంతో రైతులు పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రైతులకు సంబంధిచిన భూమి కొనుగోళ్లు, అమ్మకానికి సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో వారికి రైతు బంధు అందలేదు. ఇప్పుడు అలా ంటి భూముల వివరాలను రెవెన్యూ అధికారులు ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఈ వానకాలం సీజన్‌ నుంచి అర్హత గల రైతులకు రైతు బంధు వర్తించనున్నది.

జిల్లాలో కొత్తగా 30 వేల మందికి...

మెదక్‌ జిల్లాలో 2,16,197 మది రైతులు ఉన్నారు. కొత్త గా పాసు పుస్తకాలు పొందిన రైతులు 30 వేల మందికి రైతు బంధు అందనున్నది. రైతులకు సంబంధించిన వివరాలను చీఫ్‌ కమిషనర్‌ ఫర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీసీఎల్‌)లోని ధరణి వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇక వీరికి రైతు బంధు వర్తించేలా రైతుల వివరాలను మండల, క్లస్టర్‌ స్థాయి అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయ ఉన్నతాధికారులు పంపించారు. అయితే రైతుబంధు వర్తించాలంటే రైతుల ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా నెంబర్‌, బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, బ్యాంక్‌ పేరు, ఫోన్‌ నెంబర్‌ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. 

వానకాలం సీజన్‌ నుంచి వర్తింపు..

కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు ఈ వానకాలం నుంచి రైతు బంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆధార్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలను ఏఈవోలు సేకరించి వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. 

- పరుశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి


logo