శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jun 12, 2020 , 03:28:42

అన్నదాతకు దన్నుగా!

అన్నదాతకు దన్నుగా!

  • n ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  322 రైతు వేదికలు
  • n సిద్దిపేటలో 127, సంగారెడ్డిలో 118, మెదక్‌లో 77
  • n ఎర్రవల్లి, మర్కూక్‌లో భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్‌
  • n ఒక్కో రైతు వేదిక 2,046 చదరపు అడుగులు
  • n ఒక హాల్‌, రెండు గదులు, టాయిలెట్స్‌ నిర్మాణం
  • n ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ / మెదక్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు దన్నుగా  నిలుస్తున్నది. రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి అండగా నిలిచింది. ఇలా ఎన్నో పథకాలను ప్రశేశపెట్టి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఇక ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రైతులంతా ఒక్క దగ్గర చేరి వ్యవసాయం, పంటలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 322 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, అన్ని క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించనున్నారు. ఇటీవల రైతు వేదిక నమూనాకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలపారు . ఒక్కో భవన నిర్మాణానికి రూ. 20 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక హాల్‌, రెండు గదులు, టాయిలెట్స్‌ కలిపి 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తారు. మే 29న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు.

ఉమ్మడి జిల్లాలో 322 క్లస్టర్లు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 322 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మిస్తారు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 69 రైతు బంధు కమిటీలు ఉన్నాయి. సిద్దిపేటలో 127, సంగారెడ్డిలో 118, మెదక్‌లో 77మొత్తం 322 రైతు వేదికలను నిర్మిస్తారు. అందుకు అవసరమైన స్థలాలను కొన్ని మండలాల్లో గుర్తించగా.. మరికొన్ని చోట్ల్ల స్థలాలను ఎంపిక చేస్తున్నారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో రైతువేదిక భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. రైతు వేదిక నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ. 12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి కాగా, మిగతా రూ. 8లక్షలు ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్‌ కంపోనెట్‌ కింద నిధులు విడుదల చేస్తారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులు, రైతుబంధు కమిటీ సభ్యులు, గ్రామ, మండల కమిటీ కోఆర్డినేటర్లు అంతా ఒకేచోట కూర్చుండి చర్చించుకునేందుకు వీలుగా హాల్‌ను 1,496 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ హాల్‌లో సుమారు 154 మంది వరకు రైతులు కూర్చోవచ్చు. హాల్‌తో పాటు రెండు గదులు, టాయిలెట్లు నిర్మిస్తారు. ఇందులో ఒక గదిలో వ్యవసాయశాఖ అధికారి కూర్చుంటారు. ఆ గదిలోనే కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునేందుకు కంప్యూటర్లు, టీవీలను ఏర్పాటు చేస్తారు. అవపరమైన ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలు సమకూర్చుతారు. కాగా, ప్రతి ఐదు వేల ఎకరాలకు కలిపి ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను ప్రభుత్వం నియమించింది. 296 మంది వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు పనిచేస్తుండగా.. ఇటీవల ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేశారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో రైతుబంధు సమన్వయ సమితి కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తం 69 కమిటీలు ఉన్నాయి. రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉంటారు. నిరంతరం రైతులకు సూచనలు, సలహాలు, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో తోడ్పాటును అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు చేరేలా చూస్తారు.

ఎర్రవల్లి, మర్కూక్‌లో భమిపూజ చేసిన సీఎం కేసీఆర్‌... 

సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో రైతు వేదిక భవనాలను సొంత ఖర్చులతో నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు, ఇతరులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని మర్కూక్‌ మండలం ఎర్రవల్లి, మర్కూక్‌లో తన సొంత ఖర్చులతో రైతు వేదికను సీఎం కేసీఆర్‌ నిర్మిస్తున్నారు. మే 29న భూమి పూజ చేశారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సతీమణి  తాత దివంగత నూలి హన్మంతరావు పేరు మీద రైతు వేదిక భవనాన్ని రామాయంపేటలో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆ రైతు వేదిక నిర్మాణానికి మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సొంత ఖర్చులతో మెదక్‌ జిల్లాలోని తన స్వగ్రామమైన హవేలి ఘణపూర్‌ మండలంలోని కూచన్‌పల్లిలో, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఇర్కోడులో నిర్మిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇలా మరికొంత మంది ప్రజాప్రతినిధులు రైతు వేదికలను నిర్మిస్తామని ముందుకు వస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో 76 రైతు వేదిక భవనాలు..

మెదక్‌ జిల్లాలో 76 ఏఈవో క్లస్టర్లు ఉండగా, 76 రైతు వేదిక భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున నిర్మించనున్నారు.ఒక్కో రైతు వేదిక భవనానికి రూ.20 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. 

- పరశురాంనాయక్‌, 

వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మెదక్‌logo