ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jun 11, 2020 , 00:01:56

మెరుగైన వైద్యం.. మరింత చేరువలో..

మెరుగైన వైద్యం.. మరింత చేరువలో..

n అందుబాటులోకి బస్తీ దవాఖానలు

n వైద్యసేవలు, మందులు ఉచితం

n ఒక్కో దవాఖానలో  డాక్టర్‌తో పాటు ఇద్దరు సిబ్బంది 

n హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

మెరుగైన వైద్యసేవలు మరింత చేరువయ్యాయి.. బస్తీ దవాఖానల రూపంలో పేదలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఏర్పాటు చేసిన పలు బస్తీ దవాఖానలను రోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక డాక్టర్‌, ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. సరైన చికిత్సతోపాటు ఉచితంగా మందులు ఇస్తుండటంతో ప్రజలు   వ్యక్తం చేస్తున్నారు.  -రామచంద్రాపురం

  ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. కార్పొరేట్‌ స్థాయిలో సర్కారు దవాఖానల్లో వైద్యసేవలు అందేలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా బల్దియా సర్కిల్‌ 22లోని కానుకుంట, బండ్లగూడ, పటాన్‌చెరులో ఇటీవల బస్తీ దవాఖానలను ప్రారంభించారు. గతంలో ప్రజలు అనారోగ్యానికి గురైతే మండల కేంద్రానికో, పట్టణానికో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తమ బస్తీలోనే ఆస్పత్రి ఉండడంతో ప్రజల్లో మనోధైర్యం పెరిగింది. బస్తీ దవాఖానల్లో ప్రస్తుతం ప్రతి రోజు సుమారుగా 30 నుంచి 50మంది వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. 

వైద్యసేవలు ఇలా..

గర్భిణులకు రెగ్యులర్‌ చెకప్‌తో పాటు మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు, దగ్గు, జలుబు, విరోచనాలు, చర్మం ఎలర్జీ, కీళ్లనొప్పుల వంటి వ్యాధులకు బస్తీ దవాఖానలో చికిత్స అందుతున్నది. అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఒకవేల రోగికి వ్యాధి ముదిరితే ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలిస్తున్నారు.

నిర్వహించే పరీక్షలు..

బస్తీ దవాఖానలో దశలవారీగా ప్రభుత్వం ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ), షుగర్‌, యూరిన్‌, రక్తం, మలేరియా, టైఫాయిడ్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, బీపీ, ప్రెగ్నెన్సీ తదితర పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే పలు దవాఖానల్లో ప్రభుత్వం ల్యాబ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది.  

సద్వినియోగం చేసుకోవాలి..

-డాక్టర్‌ దివ్యజ్యోతి, కానుకుంట బస్తీ దవాఖాన 

ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేస్తున్నాం. ప్రతి రోజు 40 నుంచి 50మంది వరకు దవాఖానకు వస్తున్నారు. 


logo