మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jun 10, 2020 , 00:28:59

కరోనా వేళ.. ఆర్థిక అండ

కరోనా వేళ.. ఆర్థిక అండ

n మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు

n జిల్లాలో 12,500 సంఘాలకు  9,545 గ్రూపులు లక్ష్యం 

n మెదక్‌ జిల్లాకు రూ.247 కోట్ల రుణాలు

n రూ.50 వేల నుంచి లక్ష వరకు తీసుకొనే  అవకాశం

n ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు

మెదక్‌: కరోనా కష్టకాలంలో స్వయం సం ఘాల మహిళలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు అందించేందుకు సిద్ధమైంది. వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు కరోనా-లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరి వ్యాపారం సాగే పరిస్థితి లేదు. వారికి రెండు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారికి కరోనా రుణాలు అందించాలని నిర్ణయించింది. ప్రతినెలా రెగ్యులర్‌గా రుణాలు చెల్లించే సంఘాలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందజేయనుంది. డీఆర్డీఏ ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగనున్నది. ఒక్కో సంఘానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణం మంజూరు కానుంది. గ్రూపులోని సభ్యులు ఒక్కొక్కరు రూ.5వేల చొప్పున డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. 

జిల్లాలో...

మెదక్‌ జిల్లాలో మొత్తం 12,500 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 1.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. డీఆర్‌డీఏ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నారు. ప్రతినెలా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాలకు ప్రస్తుతం కరోనా రుణాలు అందిస్తున్నారు. జిల్లాలో 12,500 మహిళా సంఘాలు ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నాయి. కరోనా రుణాలు కావాల్సిన సంఘాలు.. సంఘ సభ్యులతో మాట్లాడుకొని రుణం కోసం తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానం కాపీతో పాటు సభ్యులు వివరాలను డీఆర్‌డీఏ అధికారులు, బ్యాంకర్లకు సమర్పించాల్సి ఉం టుంది. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే రుణాలు మంజూరవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. మంజూరైన రుణాలను గ్రూపులోని సభ్యులంతా సమానంగా తీసుకోవాలి. తీసుకున్న రుణాలను ఆరు నెలల తర్వాత చెల్లింపులు ప్రారంభించాలి. మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

9,545 గ్రూపులకు టార్గెట్‌...

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం మెదక్‌ జిల్లాకు రూ.247 కోట్లు కేటాయించింది. జిల్లాలో 12,500 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 9,545 సంఘాలకు టార్గెట్‌ విధించారు. ఇప్పటి వరకు 1,865  సంఘాలకు రూ.21.85 కోట్ల రుణాలు అందజేశారు. కరోనా విపత్కర వేళ తమకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి అండగా నిలుస్తుండడంపై మహిళా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుంటామని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి 

కరోనా వేళ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థికంగా ధీమాను కల్పించడానికి ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నది. ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తున్న గ్రూపులకు మాత్రమే ఈ కరోనా రుణాలు మంజూరు చేస్తున్నాం. జిల్లాలో 12,500 గ్రూపులు ఉం డగా, ఇప్పటి వరకు 1,865 గ్రూపులకు రూ.21.85 కోట్ల రుణాలు అందజేశాం. అర్హులైన సంఘాలు తీర్మా నం చేసి దరఖాస్తు చేసుకోవాలి.

-శ్రీనివాస్‌, డీఆర్డీవో మెదక్‌logo