సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jun 08, 2020 , 00:10:33

కరోనా వేళ.. నిర్లక్ష్యమేలా!?

కరోనా వేళ.. నిర్లక్ష్యమేలా!?

 కాచుకుని కూర్చుంది కొవిడ్‌-19  

రాష్ట్రంలో పెరుగుతున్న  కేసులు

వందల సంఖ్యలో కేసులు..  పదుల సంఖ్యలో మరణాలు

ఆందోళన కలిగిస్తున్నా.. తీరు మారని వైనం

పిల్లలతో కలిసి తిరుగుతున్న తల్లిదండ్రులు

జన సమూహాల్లోకి వస్తున్న వృద్ధులు  మాస్క్‌లు ధరించాలి.. 

శానిటైజర్‌ వాడాలి..  భౌతిక దూరం పాటించాలి..

నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు

రోజురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది.. మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది.. ఒకే రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తున్నది. అయినా, కొందరిలో భయం లేకుండా పోయింది. ‘మా వరకు రాలేదులే’.. అన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది. మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లో గుంపులుగా జనం కనిపిస్తున్నారు. అధికారులు హెచ్చరిస్తున్నా, మార్పు రావడం లేదు. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదని, ఇక కొత్త కేసులు ఏ మాత్రం నమోదు కావద్దంటే నిబంధనలు పాటించాలని డాక్టర్లు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఆలయాలు, హోటళ్లు తెరుచుకోనున్నాయి.

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా అంటే భయం లేకుండా పోతున్నది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు ఏం కాదులే అన్న ధీమాతో ఎవరికి వారు మాస్క్‌లు లేకుండానే జనంలోకి వస్తున్నారు. వృద్ధులు, పిల్లలను వెంటపెట్టుకుని జన సమూహాల్లో తిరుగుతున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. అయినప్పటికీ కొందరిలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ‘మా వరకు రాలేదులే’.. అనే గుడ్డి నమ్మకంతో కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లో గుంపులుగా జనం కనిపిస్తున్నారు. ప్రతి దుకాణం వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలనే నిబంధనలను నిర్వాహకులు పాటించడం లేదు. అధికారులు హెచ్చరిస్తున్నా, జనంలో చలనం రావడం లేదు. ఇదిలా ఉండగానే, సోమవారం నుంచి ఉమ్మడి జిల్లాలో ఆలయాలు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపటి నుంచి ఎలాగో.. అనే ఆందోళన కలుగుతున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 39 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 29మంది చికిత్స పొంది ఇండ్లకు వెళ్లిపోయారు. మరో 10మంది వరకు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదని వైద్యులు సూచిస్తున్నారు.

ఎక్కడ చూసినా గుంపులుగానే..

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాడ్‌డౌన్‌లో సడలింపులిస్తూ నిబంధనలు కూడా పెట్టింది. అయితే ఆ నిబంధనలు అమలు కాకపోగా ప్రజలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్లలో జనం గుమికూడి కనిపిస్తున్నారు. మొదట్లో తెల్లరంగుతో గీసిన బాక్సుల్లో నిలబడి వస్తువులు కొనేవారు. ఇప్పుడు చాలా వరకు భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. ఇక ఆటోల్లో జనం కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. భౌతిక దూరం లేదు, మాస్క్‌లు కనిపించడం లేదు. ఆటోల్లో శానిటైజర్‌ వాడుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. పిల్లలు, వృద్ధులతో ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. మార్కెట్లకు కూడా తీసుకెళ్తున్నారు. కరోనా విషయంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నా, ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఇష్టారీతిగా వ్యవహరించారు. బానూరు పోలీసు స్టేషన్‌ వద్ద వందలాది మంది ఎలాంటి మాస్క్‌లు లేకుండా గుంపులుగా కనిపించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఉమ్మడి జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు

కరోనా మహమ్మారి మొదలైన మార్చి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 39 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం ఇంకా 10మంది గాంధీలో ఇతర దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 29మంది చికిత్స పొంది ఆరోగ్యంగా తమ ఇండ్లకు వెళ్లారు. జిల్లాల వారీగా చూస్తే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 23 పాజిటివ్‌ కేసులకు గానూ ప్రస్తుతం ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 6 కేసుల్లో ముగ్గురు చికిత్స పొందుతుండగా, ముగ్గురు కోలుకొని, ఇంటికెళ్లారు. మెదక్‌ జిల్లాలో 10 కేసుల్లో ప్రస్తుతం ఐదుగురు చికిత్స పొందుతున్నారు. మిగతా వారు ఆరోగ్యంగా తమ ఇండ్లకు పంపించినట్లు అధికారులు చెప్పారు. 

వలస కార్మికులకు క్వారంటైన్‌

లాక్‌డౌన్‌తో తమ స్వరాష్ర్టాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు తిరిగి మళ్లీ వస్తున్నారు. రెండు బస్సుల్లో గుమ్మడిదల, జోగిపేట ప్రాంతాలకు బీహార్‌ కార్మికులు వచ్చారు. ఇలా వస్తున్నవారిని గుర్తించి, అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఇతర రాష్ర్టాల నుంచి కూడా రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలపై ఏవైనా అనుమానాలుంటే, స్థానిక ప్రభుత్వ దవాఖానల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి 10 మంది పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. వారు కూడా త్వరలో ఆరోగ్యంగా ఇండ్లకు చేరనున్నారు. ఇక కొత్త కేసులు ఏ మాత్రం నమోదు కావద్దంటే ప్రజలు నిబంధనలు పాటించాలని డాక్టర్లు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహమ్మారిని జయిద్దాం..

  • ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతో పాటు  తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.
  • వస్తువులు, వ్యక్తులను తాకినా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. 
  • మార్కెట్లకు వెళ్తే క్యూ పద్ధతిని పాటించాలి.
  • ఆటోలు, బస్సుల్లో వెళ్లేటప్పుడు శానిటైజర్‌తో పాటు మాస్క్‌ ధరించాలి.
  • మన పక్కనే పాజిటివ్‌ కేసు ఉండవచ్చుఅని అప్రమత్తంగా ఉండాలి. 
  • పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో జన సమూహాల్లోకి తీసుకెల్లొద్దు.
  • అవసరమైతే తప్పా వృద్ధులను ఇంటి నుంచి బయటకు రానివ్వొద్దు. 

భౌతిక దూరమే మందు..

కరోనాకు భౌతిక దూరమే సరైన మందు. కొందరిలో కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో అలాంటి వారు మన పక్కనే ఉండవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తే ఏం కాదు. ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రస్తుతం కరోనా ఎక్కడ నుంచి ఎలా వస్తుందో చెప్పడం కష్టం. ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చు. కరోనా అనుమానాలుంటే వైద్యులను సంప్రదించాలి.

- మోజీరాం రాథోడ్‌, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి 

ముందు జాగ్రత్తే మేలు 

ముందు జాగ్రత్తే ఏ జబ్బుకైనా మేలు చేస్తుంది. కరోనా విషయంలో ముందు జాగ్రత్త అత్యంత అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటూ వైద్య సంస్థల ద్వారా సూచన సలహాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు నడుచుకోవాలి. జాగ్రత్తలు పాటించకుండా కరోనా వైరస్‌ బారిన పడి వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు ఇతరులను ఇబ్బందిపెట్టినవారవుతారు. పిల్లలు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. 

- డాక్టర్‌ ఇంద్రసేనారెడ్డి ప్రైవేట్‌ వైద్యుడు, కొహెడ 

కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెదక్‌ జిల్లాలో ఇప్పటికి వరకు 10మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. అందులో ఐదుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తున్నది. అంతే కాకుండా 175మంది వలస కార్మికులను హోం క్వారంటైన్‌లో ఉంచాం. స్వీయ రక్షణే మేలు.

- డాక్టర్‌ నవీన్‌కుమార్‌, మెదక్‌ జిల్లా సర్వేలైన్స్‌ అధికారి 


logo