శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jun 07, 2020 , 00:18:00

కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్‌

కల్తీ విత్తనాలు అమ్మితే  పీడీయాక్ట్‌

విత్తనాల స్టాక్‌ వివరాల పట్టికను పెట్టాలి

రైతులకు కొనుగోలు రసీదు ఇవ్వాలి

జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్‌

రామాయంపేటలో సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై టాస్క్‌ఫోర్స్‌ ఆకస్మిక దాడులు

రామాయంపేట: మెదక్‌ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే  యాక్టు కింద కేసులు నమోదుచేసి లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందం అధికారి చందర్‌రాథోడ్‌, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌ కృష్ణవేణి అన్నారు.శనివారం రామాయంపేటలోని సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లతోపాటు ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్‌ వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యాపారులు ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలనే విక్రయించాలన్నారు. విత్తనాలు తీసుకున్న రైతుకు రసీదును ఇవ్వాలని సూచించారు.  విత్తన చట్టం 1966 ప్రకారం లైసెన్స్‌ కలిగి ఉండి స్టాక్‌ వివరాలను రిజిస్టర్‌లో రాయాలన్నారు. కార్యక్రమంలో రామయాంపేట ఏడీఏ వసంత సుగుణ, సురేఖ, ఏవో రాజ్‌ నారాయణ, ఎస్సై మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

నకిలీ విత్తన విక్రయేతలు అరెస్టు

సంగారెడ్డి టౌన్‌: నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సదాశివపేట సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శుక్రవారం రాత్రి సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర విగ్రహం వద్ద చంద్రకాంప్లెక్స్‌లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సదాశివపేట వ్యవసాయశాఖ ఏఈ అనిత ఫిర్యాదు మేరకు దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన సంద రాములు, అదే జిల్లా దేవరకద్ర మండలం గోపుకాపూర్‌ గ్రామానికి చెందిన చింతకాయల వెంకటేశ్‌, వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం పోలపల్లి గ్రామానికి చెందిన చెలిక వెంకటరెడ్డి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో కల్లె శ్రీనివాస్‌ నకిలీ విత్తనాలు తయారు చేసేందుకు ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇతని పరిచయంతో సదాశివపేటలో రఘు-39 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడని తెలిపారు. 150 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు మూడు సంచుల్లో దొరికినట్లు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌ విలువ రూ.750 ఉంటుందని, మొత్తం రూ.2.50లక్షల విలువ గల నకిలీ విత్తనాలు అమ్మినట్లు వివరించారు. 


logo