బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jun 05, 2020 , 23:31:45

నారింజ ప్రాజెక్టుకు మహర్దశ

నారింజ ప్రాజెక్టుకు మహర్దశ

పర్క్యూలేషన్‌ ట్యాంక్‌గా అభివృద్ధి

ప్రతి వాన చుక్కను నిల్వ చేసేందుకు గేట్లకు మరమ్మతులు

నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు పూడికతీత పనులు 

జహీరాబాద్‌లో సాగు, తాగు నీటి కష్టాలు దూరం

జోరుగా పనులు.. సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

జహీరాబాద్‌ : ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంపొందించి, సాగు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం  నారింజ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం రూ.18లక్షలు, పూడికతీత కోసం రూ.53 లక్షలు మంజూరు చేసింది. మరమ్మతులకు నీటిపారుదల శాఖ అధికారులు టెండర్లు వేసి పనులను ప్రారంభించారు. నారింజ ప్రాజెక్టును పర్క్యూలేషన్‌ ట్యాంక్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మాల్కాపూరం శివకుమార్‌  మంత్రి హరీశ్‌రావును కోరగా.. వెంటనే స్పందించిన మంత్రి పనులు చేసేందుకు కలెక్టర్‌ హనుమంతరావుకు ఆదేశాలు ఇచ్చారు.  

గేట్ల మరమ్మతులు..

కొన్ని సంవత్సరాలుగా నారింజ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో వర్షపు నీరు గేట్ల నుంచి లీకేజీ అవుతూ ఆ నీరు వృథాగా కర్ణాటక వైపు పోతుండటంతో జహీరాబాద్‌ ప్రాంత రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.   కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు లీకేజీలు సైతం పూర్తి చేయలేదు. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాల గురించి జహీరాబాద్‌ ప్రాంతంలో ఉన్న నారింజ ప్రాజెక్టును పర్క్యూలేషన్‌ ట్యాంకుగా అభివృద్ధి చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రాజెక్టుకు ఉన్న ఏడు గేట్లకు మరమ్మతులు చేస్తున్నది. లీకేజీలు సైతం లేకుండా అధికారులు చూస్తున్నారు. ఒక్కనీటి బొట్టు కూడా కర్ణాటక వైపు వెళ్లకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 

పూడికతీతతో 3వేల ఎకరాలు సాగులోకి..

కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ‘నారింజ’లో పూడిక నిండి చాలా వరకు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయింది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు వెంటనే గేట్లు ఎత్తివేసి వరద నీటిని కర్ణాటక వైపు వదిలేవారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వరద నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53లక్షలతో పూడికతీత పనులు ప్రారంభించింది. ఇటీవలే పదిరోజుల్లో పూడికతీత పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్‌ హనుమంతరావు జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబుకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆర్డీవో రమేశ్‌బాబు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పూడిక తీసేందుకు భారీ యంత్రాలు, టిప్పర్లు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి రైతుల పొలాలకు మట్టిని తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పూడికతీత పనులను జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పర్యవేక్షిస్తున్నారు. వానలు పడకముందే  పనులను పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంతో జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. నారింజ ప్రాజెక్టు కింద 3వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉన్నదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు కుడి, ఎడమ రెండు కాల్వలు ఉన్నాయి. కుడి కాల్వ కింద 550 ఎకరాలకు, ఎడమ కాల్వ కింద 2450 ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  జహీరాబాద్‌ ప్రాంతంలో చెరువులకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి చెరువు అభివృద్ధికి రూ.1.86 కోట్లు, కోహీర్‌ మండలంలోని గోటిగార్‌పల్లి చెరువుకు రూ.1.75 కోట్లు, జాడిమల్కాపూర్‌ శివారులో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.4కోట్లు, మల్‌చల్మా వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.85 లక్షలు, న్యాల్‌కల్‌ మండలంలోని చెనిగేపల్లిలో, హుమ్నాపూర్‌ శివారులో ఉన్న వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1కోటి, హుమ్నాపూర్‌లో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.6 కోట్లు, చికుర్థి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.67లక్షలు మంజూరు చేసింది.  


logo