సోమవారం 26 అక్టోబర్ 2020
Sangareddy - Jun 04, 2020 , 23:34:00

ట్రా‘ఫికర్‌'కు చెక్‌

ట్రా‘ఫికర్‌'కు చెక్‌

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘా

జిల్లాలో రెండు సబ్‌ కంట్రోల్‌ రూంలు

35 అంబ్రెల్లా బూత్‌ల ఏర్పాటు

పక్కాగా అమలుకు సన్నాహాలు

సిద్దిపేట టౌన్‌ : జిల్లాకేంద్రం సిద్దిపేటతో పాటు గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వివిధ వ్యాపార వాణిజ్య నిమిత్తం, చదువుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి అధికంగా ప్రజలు వస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సమస్యగా మారుతున్నది. సమస్యలు తలెత్తకుండా ఉల్లంఘనలు గుర్తించేందుకు కొత్తగా పాత బస్టాండ్‌ పోలీసు సబ్‌ కంట్రోల్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా గజ్వేల్‌లోను మరో పోలీసు సబ్‌ కంట్రోల్‌ బూత్‌ను ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 35 అంబ్రెల్లా బూత్‌లను యాడ్స్‌ సంస్థ సహకారంతో పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు సిద్దిపేటలో 18, హుస్నాబాద్‌లో 5, దుబ్బాకలో 2, చేర్యాలలో 4, ప్రజ్ఞాపూర్‌లో 5, కొమురవెల్లిలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 

గొడుగులా రక్షణ 

ఎండ, వాన, చలికాలంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ట్రాఫిక్‌ అంబ్రెల్లా బూత్‌ల ఏర్పాటుతో ఉపశమనం కలుగనున్నది. ట్రాఫిక్‌ పర్యవేక్షణ మరింత సులువు కానున్నది. విధులు నిర్వర్తించే పోలీసులు అంబ్రెల్లా బూత్‌లో నిల్చుని నలుదిక్కులా పర్యవేక్షణ చేసేలా ఉన్నాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు సులువుగా గుర్తించవచ్చు. వాహనదారులకు పలు సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలోనూ వీటి భాగస్వామ్యం ఉంటుంది. ట్రాఫిక్‌ అంబ్రెల్లా బూత్‌లు పోలీసులకు గొడుగులా.. రక్షణ కవచంలా నిలుస్తాయి. 

సబ్‌ కంట్రోల్‌ బూత్‌లతో ప్రత్యేక పర్యవేక్షణ 

సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల్లో జన సంచారం రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతున్నది. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా పోలీసు సబ్‌ కంట్రోల్‌ బూత్‌లను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగానే సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద ఇప్పటికే పోలీసు సబ్‌ కంట్రోల్‌ బూత్‌ను ఆ శాఖ ఏర్పాటు చేసింది. అదే విధంగా గజ్వేల్‌లోనూ పోలీసు సబ్‌ కంట్రోల్‌ రూం త్వరలో అందుబాటులోకి రానున్నది. ప్రత్యేకంగా బూత్‌లలో పోలీసులు విశ్రాంతి తీసుకునేలా విశాలంగా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు వచ్చే అధికారులకు కూడా వీటిని వినియోగించుకునేలా రూపొందించారు. ఎవరైనా తప్పిపోయినా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినా మైక్‌ సిస్టమ్‌ విధానం ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో వీటిని ఆ శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకరానున్నది.  

ట్రాఫిక్‌ నియంత్రణ సులభం 

ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కొత్తగా జిల్లాలో 2 పోలీసు సబ్‌ కంట్రోల్‌ బూత్‌లను, 35 అంబ్రెల్లా బూత్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా సులువుగా పర్యవేక్షణ జరుపవచ్చు. పోలీసుల సూచనలు, సలహాలు తీసుకుంటే ట్రాఫిక్‌ రహిత పట్టణాలుగా రూపొందుతాయి. - ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ 


logo