మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jun 02, 2020 , 02:34:10

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మెతుకుసీమ

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మెతుకుసీమ

  • అన్ని వర్గాలకుసంక్షేమ పథకాలు
  • రైతుల అభ్యున్నతికి విశేష కృషి
  • బంగారు తెలంగాణ దారిలో సాగుతున్న పయనం

పోరాడి సాధించుకున్న తెలంగాణకు నేటికి ఆరేండ్లు... తెలంగాణ సాధనలోనే కాదు.. అభివృద్ధిలోనూ పాలకులు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించడంతో మెతుకుసీమ రూపురేఖలు మారాయి.. గలగలా గోదారి తరలివచ్చింది.. రంగనాయక సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు ఉరకలు వేస్తూ ఇక్కడి ప్రజలకు కొండంత అండగా నిలిచింది. దీంతో కాలువలు, చెరువులు నిండుకుండల్లా మారి కనులపండుగ చేస్తున్నాయి. ఇంకా వేగంగా పూర్తవుతున్న చెక్‌డ్యామ్‌లతో వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానున్నది. వందకోట్లతో మరమ్మతులు పూర్తవుతున్న సింగూరు నుంచి సర్వాంగ సుందరంగా ముస్తాబైన కోమటిచెరువు వరకు అభివృద్ధికి అద్దం పడుతున్నాయి. వందల కోట్లతో సిద్ధమైన దవాఖానలు, కలెక్టరేట్లు, గజ్వేల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌, మార్కెట్లు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఫోర్‌లేన్‌ రోడ్లు, బటర్‌ఫ్లై లైట్లు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. ఇంకా సంక్షేమ పథకాలకైతే లెక్కే లేదు.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ ఇలా అనేకం.. సమర్థవంతంగా అమలవుతూ దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచాయి. తెలంగాణ వస్తే ఏమోస్తది అన్న వాళ్లకు అటు అభివృద్ధిలోనూ, ఇటు సంక్షేమంలోనూ మాకు మేమే సాటి అని నిరూపించి.. సీఎం కేసీఆర్‌ కలలుగన్న బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది.. ఆ గమ్యాన్ని చేరే దిశలో మరో మైలురాయిగా ఆరు వసంతాలు నిండిన సందర్భంగా  ఆ అభివృద్ధి విశేషాలు మరోసారి మననం  చేసుకుందాం...

సంగారెడ్డి ప్రతినిధి/ సిద్దిపేట, నమస్తేతెలంగాణ : ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధిలో అద్భుతాలు సాధించింది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మెతుకుసీమ స్వరాష్ట్రంలో అభివృద్ధికి చిరునామాగా మారింది. ఎలాంటి ప్రాజెక్టులు లేని ఈ జిల్లాను గత పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. సాగు నీటి కోసం నిర్మించిన సింగూరు జలాలను కేవలం హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వాడారు. రాష్ట్రం సిద్ధించాక ‘సింగూరు’ను ఆధునికీకరించి 40 వేల ఎకరాలకు ప్రభుత్వం సాగు నీరందించింది. ఘనపురం, నల్లవాగులను అభివృద్ధి చేసి, చెరువులను పునరుద్ధరించింది.  ‘కాళేశ్వర’ జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడాయి. రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు చేరాయి. సంక్షేమ పథకాల అమలులో రాజీపడలేదు.  సిద్దిపేటకు మెడికల్‌ కళాశాల ఏర్పాటు కాగా, ములుగుకు అటవీ కళాశాల, హార్టికల్చర్‌ యూనివర్సిటీలు వచ్చాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ రూపురేఖలు పూర్తిగా మారాయి.  

 మెతుకు సీమ నుంచే 24 గంటల విద్యుత్‌కు శ్రీకారం

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే ప్రారంభించింది. మెదక్‌,సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 2017 జూన్‌ 20 నుంచి 24 గంటల విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ సక్సెస్‌ కావడంతో 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు 

552 ఎకరాల్లో మెడికల్‌ డివైజ్‌ పార్కు..

పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ వద్ద 552 ఎకరాల్లో మెడికల్‌ డివైజ్‌ పార్కు ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి 7 పరిశ్రమలు తమ ఉత్ఫత్తుల ప్రారంభానికి రెడీ కాగా 14 పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. రూ.250 కోట్లతో స్టంట్ల పరిశ్రమ నిర్మాణానికి గడిచిన సెప్టెంబర్‌లో భూమి పూజ చేశారు. ఈ పార్క్‌కు 2017లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు భూమి పూజ చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 20 వేల మందికి ఉపాధి లభించనున్నది. పటాన్‌చెరు మండలం నందిగామలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌నూ ఏర్పాటు చేసింది. మహిళా పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది.

సింగూరుతో 40 వేల ఎకరాలు సాగులోకి..

సింగూరు ఆధునీకరణతో 40వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సార్లు రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. ఆ నిధులతో కాలువలు ఆధునీకరించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా పలు మార్లు వచ్చి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో సింగూరు నిండిన సమయంలో 40వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ప్రభుత్వంలోనే సాగునీళ్లు ఇవ్వడంతో రైతులు సంతోష పడ్డారు. రూ.24.14 కోట్లతో నల్లవాగును ఆధునీకరించారు. 

ఇక్కడి నుంచి భగీరథ షురూ..

మెతుకుసీమలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. మిషన్‌భగీరథతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. దేశ ప్రధాని నరేంద్రమోడీ గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద భగీరథ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే మొదటగా భగీరథ ఫలాలు అందడం విశేషం.

సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పరుగులు..

 స్వరాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. జిల్లాలోని 771 ఆవాసాలకు రూ.1,600 కోట్ల అంచనాతో 580 తాగునీటి ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారు. 2,729 కి,మీ పైపులైన్‌ వేసి 2,17,266 నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందిస్తున్నారు. జిల్లాలో 12,820 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 10,671 ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించగా, 7,136 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ వరకు 32 కి.మీ మేర 13 మీటర్ల వెడల్పుతో ట్రాక్‌లైన్‌ పనులు పూర్తి చేశారు. రూ.50 కోట్లతో నిర్మిస్తున్న సిద్దిపేట కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో రూ.137 కోట్లతో 25 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. 

కాళేశ్వరం ప్రాజెక్టు ..

 కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8,45,656 ఎకరాలు, సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ను 3.50 టీఎంసీలు, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ వద్ద శ్రీరంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ను 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ రెండు రిజర్వాయర్లకు ఏప్రిల్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు గోదావరి జలాలను విడుదల చేశారు. మల్లన్న సాగర్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గడిచిన నెల 29న సీఎం కేసీఆర్‌  గోదావరి జలాలను విడుదల చేశారు. జిల్లాలో  బెజ్జంకి మండలం తోటపల్లిలో  (తోటపల్లి ఆన్‌లైన్‌ ) రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించింది. హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరిదశకు చేరాయి. జనగామ నియోజకవర్గంలోని (సిద్దిపేట జిల్లా )కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ - తపాస్‌పల్లి గ్రామాల శివారుల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను 0.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగంగా ముంపు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను నిర్మించడంతో గృహప్రవేశాలు జరిగాయి. 

మెతుకుసీమకు నిధుల వరద...

మెతుకుసీమకు స్వరాష్ట్రంలో నిధుల వరద పారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపే ఘనపూర్‌ ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే నిర్వహించి, రూ.వంద కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు దశదిశ మారింది. ప్రాజెక్టు ఎత్తుపెంపుతో పాటు ఎడమ, కుడి కాలువలకు  (ఫతేనహర్‌),(మహబూబ్‌నహర్‌) సిమెంట్‌ లైనింగ్‌ పనులకు నిధులు మంజూరయ్యాయి. నర్సాపూర్‌లో బస్‌డిపో నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. నర్సాపూర్‌, మనోహరాబాద్‌, పరిగిబండ, ఒడియారంలలో అర్బన్‌ పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో పర్యాటకుల కోసం రూ.8.2 కోట్లతో అర్బన్‌ పార్కును నిర్మిస్తున్నది. వాకింగ్‌ ట్రాక్‌తో పాటు పిల్లలు ఆడుకోవడానికి పార్కు, టూరిస్టులకు ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో పార్కు నిర్మాణం జరుగుతుంది. 10 ఎకరాల స్థలంలో విశాలంగా ఈ పార్కు నిర్మాణం జరుగుతున్నది. ఇది పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనున్నది.

గజ్వేల్‌ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆరేండ్లలోనే 70 ఏండ్ల అభివృద్ధిని చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కింది. అత్యాధునిక హంగులతో వివిధ శాఖలకు సంబంధించిన భవనాలు, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ములుగు మండల కేంద్రంలో రూ.135 కోట్ల ఐసీఏఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌) నిధులతో 16 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. రూ.75 కోట్లతో అధునాతన హంగులతో జీప్లస్‌-2 పద్ధతిన భవనాన్ని నిర్మించారు. గజ్వేల్‌ పట్టణ నడిబొడ్డున రూ. 22.85 కోట్లతో సమీకృత మార్కెట్‌ యార్డును నిర్మించారు.  రూ. 42.50 కోట్ల వ్యయంతో సమీకృత భవన సముదాయం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, లలిత కళాతోరణం తదితర వేదికల కంటే మరింత అధునాతనంగా గజ్వేల్‌ పట్టణంలో మహతి ఆడిటోరియాన్ని అద్భుతంగా నిర్మించారు. రెండెకరాల విస్తీర్ణంలో సమావేశ మందిరాన్ని రూ.19.47 కోట్లతో నిర్మించారు. ఈ మహతి ఆడిటోరియంలో సభలు, సమావేశాలతో పాటుగా కవులు, కళాకారుల కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు పాఠశాలలు, కళాశాలల కార్యక్రమాలకు వేదికైంది. 


logo