శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - May 31, 2020 , 02:10:37

పాత కక్షలతో హత్య

పాత కక్షలతో హత్య

  • తలపై కర్రతో బాదడంతో అక్కడిక్కక్కడే మృతి
  • ప్రాణాల మీదకు తెచ్చిన వర్షపు నీటి సమస్య
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంగారెడ్డి : భూమి, ఇండ్ల స్థలాల విషయంలో గొడవలు తారస్థాయికి చేరుకుని హత్యకు దారితీసిన ఉదంతం సదాశివపేట మండలం నిజాంపూర్‌ గ్రామంలో జరిగింది. శనివారం మృతుడి భార్య సావిత్రి, పోలీసుల తెలిపిన ప్రకారం... సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌ గ్రామానికి చెందిన చాకలి వెంకటయ్య(45)ను తన అన్న కుమారుడు గోపాల్‌ కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం రాత్రి 8.00 గంటల ప్రాంతంలో గాలిదుమారంతో వర్షం కురిసింది. వెంకటయ్య ఇంటి ముందు నుంచి వర్షం నీరు పోకుండా అన్న వీరయ్య నీటికి అడ్డుకట్టవేశాడు. ఇది గమనించి వెంకటయ్య వర్షం నీరు వెళ్లడానికి కట్టలను తొలగిస్తున్న సమయంలో వీరయ్య కొడుకు గోపాల్‌ దుర్భాషలాడుతూ అడ్డుకున్నాడు.

దీంతో మాటా మాటా పెరిగి గొడవకు దారితీయడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు ఘర్షణ పడ్డారు. మృతుడు వెంకటయ్య గొడవ పడొద్దు పొద్దున గ్రామ పెద్దలకు చెబుతామని తన కుటుంబ సభ్యులకు చెబుతూ ఇంట్లోకి వస్తున్న సమయంలో అన్న కుమారుడు గోపాల్‌ కర్రతో తలపై బాదడంతో బలమైన గాయమై కుప్పకూలాడు. ఈ సంఘటనను చూసిన వెంకటయ్య కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ 108కు సమాచారం ఇచ్చారు. గ్రామానికి 108 వాహనం చేరుకుని గాయపడిన వెంకటయ్యను సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి బార్య సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.