గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - May 31, 2020 , 02:06:42

పోలీసు శాఖలో ‘కరోనా’ నివారణకు చర్యలు‌ : ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి

పోలీసు శాఖలో ‘కరోనా’ నివారణకు చర్యలు‌ : ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి

సంగారెడ్డి టౌన్‌ : నిరంతరం ప్రజలతో మమేకమై ఉండే పోలీసు శాఖలోని సిబ్బందికి ‘కరోనా’ వైరస్‌ సోకకుండా ఉండటానికి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అధికారులకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యగా పోలీసు అధికారులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాత్రలను ఎవరు వేసుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు  వాడాలి అన్న విషయాలను తెలిపారు. 400 ఎంజీ(200 ఎంజీ మాత్రలు రెండు) హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలను పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న (దీర్ఘకాలిక వ్యాధులు లేని) అందరూ పోలీసు అధికారులు, సిబ్బంది, వారానికి ఒకటి చొప్పున 7 వారాల పాటు వేసుకోవాలని సూచించారు. మొదటి వారం మాత్రం ఈ మాత్రలను ఉదయం, రాత్రి సమయాల్లో అన్నం తిన్న తరువాత వేసుకోవాలన్నారు. పోలీసు శాఖ ‘కరోనా’ వైరస్‌ నిర్మూలనకు మార్చి 22వ తేదీ నుంచి వివిధ రకాల విధులను నిర్వహిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారి కోసం చేతులు శుభ్రం చేసుకునేందుకు ఒక స్టాండు, థర్మల్‌ స్కానర్‌లను అందజేస్తామన్నారు. పోలీసు స్టేషన్లలో 55 సంవత్సరాలు దాటిన వారికి ‘కరోనా’ వైరస్‌ సోకే అవకాశం ఉన్నందున స్టేషన్‌ విధులు మాత్రమే అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కె.సృజన, పోలీసు మెడికల్‌ డిస్పెన్సరి డాక్టర్‌ జ్యోతి, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్‌ నాయుడు, డీసీఆర్‌బీ సీఐ రామకృష్ణారెడ్డి, ఐటీ కోర్‌ టీ సీఐ హేమరాణి, అన్ని సబ్‌ డివిజన్ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


logo