గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - May 29, 2020 , 23:58:35

మెతుకుసీమ..నయాగర కొండపోచమ్మ

మెతుకుసీమ..నయాగర కొండపోచమ్మ

కరువుఛాయలు రాజ్యమేలిన మెతుకు సీమలో గోదావరి సుశ్యామల తరంగిణిలా గలగలా ప్రవహిస్తూ వచ్చి మరో అడుగు ముందుకేసింది. దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి  వందలాది కిలోమీటర్ల దూరం పయనించి కొండంత ఎత్తున్న పోచమ్మ జలాశయం వద్ద ఒక్కసారిగా ఎగిసిపడింది.  ఎర్రటి ఎండల్లోనూ మెతుకుసీమలో పంపుహౌస్‌లో నుంచి ఉబికి వస్తున్న దృశ్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పానికి నిలువెత్తు దర్పణం. ఓ గొప్ప ఆశయానికి శుక్రవారం సందర్భమైంది. ఇందుకు కొండపోచమ్మ జలాశయం వేదికైంది.  నయాగరతో పోలికై మెతుకుసీమకు జలసిరియై నిలిచింది.  

ఎర్రవల్లి అంతా బంగారం పండిస్తం.. 

కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టుతో మా ఎర్రవల్లి రైతులమంతా బంగారు పంటలు పండిస్తం. ఇప్పటికే మా ఊరిలో వ్యవసాయంపై   సీఎం కేసీఆర్‌ అధికారులతో అవగాహన కల్పించారు. ఇక ఈ ప్రాజెక్టుతో మా బోర్లలో నీళ్లు రావడంతో పాటు కాలువల నీటితో కూడా మంచిగ పంటలు సాగు చేసుకుంటాం.

- భాగ్య భిక్షపతి, సర్పంచ్‌, ఎర్రవల్లి  


రైతులంతా సంతోషంగా ఉన్నరు..

మా జీవితంలో  ఎప్పుడూ ఇంత సంతోషపడలేదు. మా ఊరే కాదు. మా పక్క ఊర్లల్ల కూడా రైతులంతా చాలా సంతోషంగా ఉన్నా రు. ఇన్ని రోజులు పంటలు పండించనీకి నీళ్లుకు పడ్డ గోసలు ఇక ఉండయి కదా అని ఆనందంతో ముచ్చట పెట్టుకుంటున్నరు. సీఎం కేసీఆర్‌ రైతులకు అన్ని చేస్తుండు.

- కిష్టారెడ్డి రైతు, ఎర్రవల్లి 

కరువు తీరా.. గంగమ్మ

ఉదయం 11.02 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌ బండ్‌ వద్దకు సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. అక్కడ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి అందరు నదిలోకి నాణాలను వేసి విజయసంకేతాన్ని చూపారు.

కొండపోచమ్మలోకి.. ఒదిగి!!

మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 10.49 గంటలకు సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామితో కలిసి స్విచ్‌ ఆన్‌ చేసి మోటర్లను ప్రారంభించారు. రెండు నిమిషాల వ్యవధిలోనే కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఉరకలెత్తాయి.


logo