మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - May 28, 2020 , 23:23:49

జహీరాబాద్‌ జీవనధారగా ‘నారింజ’

జహీరాబాద్‌ జీవనధారగా ‘నారింజ’

  • రూ. 18 లక్షలతో  గేట్లు మరమ్మతులు... 
  •  రూ.50 లక్షలతో పూడిక తొలగింపు పనులు 
  • వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాలు

జహీరాబాద్‌ : నారింజ ప్రాజెక్టును జహీరాబాద్‌కు జీవనధారగా మార్చి, పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తామని  కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గురువారం జహీరాబాద్‌ మండలంలోని నారింజ ప్రాజెక్టును కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌తో కలిసి పరిశీలించారు. 

ప్రతి వర్షపు నీటిని నిల్వ చేసేందుకు నారింజ ప్రాజెక్టు గేట్లను రూ. 18 లక్షలతో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. మరమ్మతు పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వాన నీరు లీకేజీ కాకుండా మరమ్మతులు చేయాలని, ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రాజెక్టులో పూడిక మట్టిని తొలగించేందుకు ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసిందన్నారు. రైతులకు మట్టిని ఉచితంగా ఇస్తామని, వాహనాన్ని వారే తెచ్చుకోవాలన్నారు. రైతులు ముందుకు రాకపోతే మట్టిని కట్టపై పోసేందుకు ప్రణాళిక చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేందుకు లీకేజీలు లేకుండా చేయాలని చెప్పారు.ఆర్డీవో రమేశ్‌బాబు, నీటిపారుదల శాఖ డీఈఈ రామేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


logo