బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - May 28, 2020 , 00:27:02

డీసీసీబీ టర్నోవర్‌ పెంచాలి

డీసీసీబీ టర్నోవర్‌ పెంచాలి

  • డీసీసీబీ పాలకవర్గ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలో మొద టి స్థానంలో నిలవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని డీసీసీబీలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బ్యాంకు టర్నోవర్‌ పెంచాలని సూచించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు రుణాలు సహకార బ్యాంకుకు బదిలీ చేయాలని కలెక్టర్‌, డీసీసీబీ  సీఈవోకు సూచించారు. ఏపీజీవీబీ, డీసీసీబీలు ఒకే చోట ఉన్నట్లయితే స్వయం సహాయక సంఘాల గ్రూపులను డీసీసీబీకి మార్చాలని నిర్ణయించారు. మహిళా గ్రూపులకు ఇస్తున్న రుణాలపై వడ్డీని రివైజ్‌ చేసి తగ్గించి ఇవ్వడానికి పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా ఐదు శాతం కమీషన్‌ ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ కమీషన్‌ గ్రూపునకు కాకుండా జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలకు వెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు చేకూరుతున్న లాభం గురించి తెలియజేయాలని డీఆర్‌డీవోకు సూచించారు. 

అధ్యయన కమిటీ..

కరీంనగర్‌, నిజామాబాద్‌ డీసీసీబీలు ముందజలో ఉండడానికి వారు అమలు చేస్తున్న చర్యలు ఏమిటన్న విషయంపై అధ్యయనం చేసి బ్యాంకు అభివృద్ది కోసం కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి పాలకవర్గానికి సూచించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించి ముగ్గురు డైరెక్టర్లు (ఒక్కో జిల్లా నుంచి ఒక్కరు..),  ఇద్దరు అధికారులతో కమిటీ వేయడానికి ఆమోదం తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లో అమలవుతున్న పద్ధతులను జిల్లాలో అమలు చేయడానికి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవడానికి ఆమోదం తెలిపారు. మల్బరీ సాగును ప్రోత్సహించాలని, జిల్లాలో వెయ్యి ఎకరాలు సాగు అయ్యేలా చూడాలని, అందుకు ఈజీఎస్‌ ద్వారా, బ్యాంకు నుంచి కొంత రుణాన్ని రైతులకు అందిస్తే బాగుంటుందని మంత్రి సూచించారు. అనంతరం బ్యాంకు లింకేజీ పథకం కింద స్వయం సహాయక మహిళా గ్రూపులకు రూ. 10.41 కోట్ల చెక్కును మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి అందజేశారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, కలెక్టర్‌ హనుమంతరావు, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, పాలకవర్గ సభ్యులు, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీసీవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. logo