శనివారం 06 జూన్ 2020
Sangareddy - May 24, 2020 , 02:14:37

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలి

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సంగారెడ్డి టౌన్‌: వానకాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పల్లెప్రగతి, వానకాలంలో వ్యాపించే అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, అందరి కృషితో అది సాధ్యమైందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిష్ట పెరిగిందన్నారు. పల్లెప్రగతిని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కొనసాగించాలని, గ్రామాల్లో పరిశుభ్రత నెలకొందని, దాంతో కరోనాను గ్రామాలు కట్టడి చేశాయన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌, కార్యదర్శి ప్రతి వార్డును సందర్శించాలన్నారు. గ్రామాల్లోని మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తాచెదారాన్ని నిర్మూలించి, ముళ్లపొదలను తొలిగించాలని సూచించారు. నీటి కాల్వలను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద నిర్మించుకోవాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించి ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మార్కెట్‌ యార్డులో ఎక్కడా  పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. ప్రతి ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని సూచించారు. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో కలెక్టర్లు, పోలీ సు అధికారులు, ఆయాశాఖల అధికారులు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, జడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo