మంగళవారం 26 మే 2020
Sangareddy - May 24, 2020 , 02:02:14

రైతు సేవే.. దేశ సేవ

రైతు సేవే.. దేశ సేవ

  •  నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయాలి
  • గిట్టుబాటు ధర కోసం నూతన విధానానికి శ్రీకారం
  • వానకాలంలో కోటి 40లక్షల ఎకరాలకు రైతుబంధు
  • ఒకేరోజు 116 రైతు వేదికలకు శంకుస్థాపన
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి/ సంగారెడ్డి టౌన్‌:  రైతుకు సేవ చేస్తే సమాజానికి, దేశానికి సేవ చేసినట్లేనని, నూతన పద్ధతులతో సాగులో మార్పులు తీసుకువచ్చేది రైతులేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం కొండాపూర్‌ మండలం గోకుల్‌ ఫంక్షన్‌హాల్లో ‘నియంత్రిత సాగు విధానం, లాభసాటి వ్యవసాయం’పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు లాభసాటి పంటలు వేసేందుకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయడానికి కార్యచరణ రూపొందించిందన్నారు. వానకాలంలో కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం అమలు చేస్తామన్నారు. వానకాలంలో సుమారు రూ.7 వేల కోట్లు, యాసంగిలో రూ.7 వేల కోట్లు రైతుబంధు ఇస్తామని తెలిపారు. జిల్లాలో ఒకేరోజు 116 రైతు వేదికలకు శంకుస్థాపనలు చేసి రైతులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వానకాలం సాగులో 6,38,814 ఎకరాలు సాగవుతుందని, అందులో 55వేల ఎకరాల్లో వరి సాగు చేశామని, ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో వరిసాగు చేయాలన్నారు. అందులో కొంతమేర సన్నరకాలు సాగుచేయాలని రైతులకు మంత్రి సూచించారు. గత సంవత్సరం 3.47లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి 3.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలన్నారు. 75వేల ఎకరాల వరకు కంది పండించాలన్నారు. ఈమేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలకు మంత్రి సూచించారు. అలాగే, పెసలు, మినుము, సోయాబీన్‌ తదితర మార్కెట్‌లో డిమాండ్‌ గల పంటలను రైతులు వేసుకోవాలన్నారు.

ప్రతి గ్రామానికి ఎరువులు..

జిల్లాలోని ప్రతి గ్రామానికి ముందుగానే ఎరువులను తీసుకువెళ్లాలని పీఏసీఎస్‌ సంస్థలు, డీలర్ల వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి ప్రకటించారు. కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాసిరకం, కల్తీ విత్తనాలను అమ్మినట్లయితే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల దగ్గరకు వెళ్లి ప్రతిరోజు ప్రతి విస్తరణ అధికారి 20 మంది రైతులను కలువాలన్నారు. నూతన సాగు విధానంపై అవగాహన కల్పించి వానకాలంలో లాభసాటి, అధిక దిగుబడి, డిమాండ్‌ ఉన్న పంటలు, కూరగాయలు, పూలసాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. పంటల సాగు విషయమై దశ, దిశ నిర్దేశించుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రైతుబంధు సమితి ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ఆయా గ్రామ మండలస్థాయి ప్రతినిధులదేనన్నారు.సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

లాభదాయక పంటలు వేయాలి.. కలెక్టర్‌ హనుమంతరావు

రైతుకు ఏది లాభదాయకమైందో ఆ పంటలు వేయాలి. నూతన సాగు విధానం అన్ని పంటలతో కూడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సాంప్రదాయ పంటల వైపు కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. రైతులు లాభాల బాట పట్టే విధంగా సలహాలు, సూచనలు ఇచ్చి నూతన సాగు విధానంపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి ఆర్థిక స్వావలంబన సాధించాలి.

రైతులు లాభాల బాటపట్టాలి..- ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతులు పంటల దిగుబడి సాధించి లాభాల బాట పట్టాలి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతులను చైతన్యపరిచేందుకు సదస్సులు ఏర్పాటు చేసి వివరించడం రైతుల అదృష్టం. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను పండించి ఆర్థికంగా రైతు బలపడేందుకు వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. గ్రామాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతులను నూతన పంటల సాగు విధానంపై చైతన్యపర్చేందుకు సదస్సులను నిర్వహించాలి. 

రైతు రాజుకావాలి.. - జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ 

సీఎం కేసీఆర్‌ పంటల మార్పునకు శ్రీకారం చుట్టి రైతును రాజు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పంటల సాగు విధానంలో నూతన ఒరవడులను సృష్టించి, రైతు డబ్బుల కోసం చేయిచాచకుండా లాభసాటి పంటలను వేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే పంటలలో మార్పు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులు, రైతులపై ఉంది. 

డిమాండ్‌ తగ్గట్టుగా పండిస్తే లాభం

గజ్వేల్‌అర్బన్‌: మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా పండిస్తే రైతులు ఆర్థికంగా లాభపడతారని, అందుకే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు పద్ధతికి శ్రీకారం చుట్టారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం గజ్వేల్‌ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రైతుబంధు కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులకు నియంత్రిత సాగుపై అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వానకాలంలో మొక్కజొన్న పంటకు బదులు వరి సన్న, దొడ్డు రకాలు, కూరగాయలు, పత్తి, కంది, శనగ, జొన్న తదితర పంటలను సాగుచేయాలన్నారు. మొక్కజొన్న పంటను ఏరాష్ట్రంలోనైనా అమ్ముకోవచ్చన్న కేంద్ర విధానాల ద్వారా ఇతర రాష్ర్టాలు మార్కెట్‌లో మొక్కజొన్న అధికంగా తీసుకువస్తాయని, దీనివల్ల రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి భవిష్యుత్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించడానికి రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. నియంత్రిత సాగు గురించి గ్రామాల్లో పది రోజుల పాటు ఏఈవోలు గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో రైతులు కాలంపై ఆధారపడి పంటలు సాగు చేశారని, ఇక నుంచి కాళేశ్వరంపై ఆధారపడి పంటలు చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, భూపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌, హార్టికల్చర్‌ జేడీ రామలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


logo