సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - May 24, 2020 , 01:45:06

డూప్లి ‘కేటు’పై టాస్క్‌ఫోర్స్‌

డూప్లి ‘కేటు’పై టాస్క్‌ఫోర్స్‌

  • కల్తీ విత్తనాల అమ్మే డీలర్లపై కఠిన చర్యలు
  • ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అధికార బృందాలు
  • ఎరువులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు
  • సంగారెడ్డి జిల్లాలో 11 డీలర్‌ షిప్పులు రద్దు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయశాఖ అప్రమత్తం
  • రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు

వానకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు కల్తీలను అరికట్టడానికి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం నడుంకట్టింది. కల్తీ, నకిలీ విత్తనాలు సాగు చేసి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే టాస్క్‌పోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో నాసిరకం విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్‌లను కలెక్టర్‌ హనుమంతరావు రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ప్రభుత్వం సూచించిన పంటల సాగు చేయడం ఒక భాగమైతే, నాసిరకం, కల్తీ విత్తనాల విక్రయాలను అరికట్టడం, కృత్రిమ కొరతలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మరో భాగం. ఈ వానకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు కల్తీలను అరికట్టడానికి ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం నడుంకట్టింది. ఇందులో భాగంగానే టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో నాసిరకం విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్‌లను కలెక్టర్‌ రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారుల హెచ్చరికలతో డీలర్లు అప్రమత్తమవుతున్నారు.

డీలర్‌ షిప్‌ల రద్దుతో అప్రమత్తం..

నాసిరకం విత్తనాలు రైతులకు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్సులు రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్‌ హనుమంతరావు శుక్రవారం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సదరు డీలర్లు విత్తనాలు అమ్మింది గత వానకాలంలో అయినప్పటికీ నకిలీ విత్తనాలు అమ్మినట్లు పరిశీలనలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇటీవల పలుమార్లు నిర్వహించిన సమీక్షల్లో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు విధానం అమలులో నకిలీలు అరికట్టడం కూడా ప్రధాన అంశం అని సీఎం సూచించారు. వ్యవసాయ అధికారుల నివేదికల మేరకు 11 మంది లైసెన్సులను కలెక్టర్‌ రద్దు చేశారు.  

ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు..

నాసిరకం విత్తనాలు అరికట్టడంతో పాటు ఎరువులు, విత్తనాల  కొరత సృష్టించకుండా వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ బందాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో 69 మండలాలు ఉండగా మండల, జిల్లా స్థాయిలో ఈ బృందాలు ఉన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాలో ఈ బృందాల సభ్యులు ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీ చేపట్టనున్నారు. అన్ని దుకాణాల వద్ద ఎరువులు, విత్తనాలు ధరలను సూచించే బోర్డులు తప్పకుండా ఉండాలి. అధికారులు తనిఖీ చేసిన సమయంలో రికార్డుల ప్రకారం ఎరువులు, విత్తనాల నిల్వలు కూడా కనిపించాలి. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన డీలర్ల వద్ద తప్ప ఇతర ప్రైవేట్‌ స్థలాల్లో ఎరువులు, విత్తనాలు నిల్వ చేసినట్లు గుర్తిస్తే టాస్క్‌ఫోర్స్‌ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 

మొక్కజొన్న విత్తనాలు అమ్మకుండా చర్యలు..

వానకాలంలో పత్తి, వరి, కంది, మినుము, పెసర, కూరగాయ పంటలు పండించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా మొక్కజొన్న సాగు చేయకూడదని రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అసలు విత్తనాలే అందుబాటులో లేకుండా చూడాలని అధికారులు చూస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ  రైతులకు మొక్కజొన్న విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్స్‌ దుకాణాల డీలర్లకు కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారి చేశారు.  ఈ సారి ప్రతి గ్రామంలో  ఏ పంట సాగు చేశారో అనే వివరాలు ఏఈవోలు, రైతుబంధు సమితి సభ్యులు సేకరించనున్నారు. 

అధికారులు సూచించిన పంటలే సాగు చేయాలి.. 

ఉమ్మడి జిల్లాలో అధికారులు సూచించిన పంటలు మాత్రమే సాగు చేయడంలో ఏఈవోలు, రైతుబంధు సమితులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల వారీగా ప్రధాన పంటల సాగు అంచనాలు కూడా అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో శనివారం నుంచి గ్రామ సభలు కూడా మొదలయ్యాయి. మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంగారెడ్డి, గజ్వేల్‌లో శనివారం అవగాహన సదస్సుల్లో నియంత్రిత సాగు విధానంపై దిశా నిర్ధేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల సూచనలు పాటించకుండా పంటలు సాగుచేసే వారికి రైతుబంధు పథకం వర్తించదని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా నియంత్రిత సాగు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు నాసిరకం విత్తనాల విక్రయాలను అరికట్టడంపై అధికారులు ప్రధాన దృష్టి సారించినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 

మూడు ఫర్టిలైజర్స్‌, సీడ్స్‌దుకాణాలు సీజ్‌

న్యాల్‌కల్‌ :  మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లో నకిలీ విత్తనాలు విక్రయించిన మూడు ఫర్టిలైజర్స్‌, సీడ్స్‌ దుకాణాలను శనివారం మండల వ్యవసాయ అధికారి లావణ్య సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం వానకాలంలో  గ్రామంలోని శ్రీవినాయక, రాయల్స్‌ ఫర్టిలైజర్స్‌-సీడ్స్‌, శ్రీధనలక్ష్మి ట్రేడర్స్‌ దుకాణాదారులు భక్తి  నూజివీడు విత్తనాలు విక్రయించారు. మండలంలోని ముంగి గ్రామానికి చెందిన 39 మంది రైతులు ఈ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి 96ఎకరాల్లో సాగుచేశారు. పత్తి పంట ఏపుగా పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో పూత, కాయలు కాయలేదు. ఈ విషయాన్ని అప్పట్లో మా దృష్టికి రైతులు తీసుకువచ్చారు. జిల్లా అధికారులతో పాటు శాస్త్రవేత్తలు ఆ పంట పొలాలను సందర్శించిన అనంతరం పూత, కాయలను తీసుకెళ్లి ల్యాబ్‌లో పరిశీలించగా విత్తనాలు నకిలీవని గుర్తించారన్నారు. సంబంధిత కంపెనీ అధికారులతో జిల్లా అధికారులు మాట్లాడగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని కంపెనీ యజమానులు తెలిపారన్నారు. అయినప్పట్టికీ రైతులకు పరిహారాన్ని చెల్లించలేదు. దీంతో జిల్లా వ్యవసాయాధికారి నర్సింగ్‌రావు ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీవినాయక, రాయల్స్‌ ఫర్టిలైజర్స్‌, సీడ్స్‌, శ్రీధనలక్ష్మి ట్రేడర్స్‌ దుకాణాల్లో ఉన్న సీడ్స్‌, ఎరువులు, రికార్డులను పరిశీలించి సీజ్‌ చేసినట్టు ఏవో లావణ్య తెలిపారు.


logo