సోమవారం 25 మే 2020
Sangareddy - May 23, 2020 , 00:56:14

హరితహారానికి సన్నద్ధం

హరితహారానికి సన్నద్ధం

నర్సరీలో ముమ్మరంగా మొక్కల పెంపకం

సందర్శించి సూచనలు ఇస్తున్న అధికారులు

న్యాల్‌కల్‌: ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని జూన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అధికారులు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డ్వామా, జిల్లా అటవీ శాఖ సంయుక్తంగా ప్రతి సంవత్సరం హరితహారంలో భాగస్వాములవుతున్నాయి. ఈసారి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మండలంలోని 37 పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఆయా నర్సరీల్లో 2.56 లక్షల మేర పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. తరుచుగా జిల్లా, మండల స్థాయి అధికారులు సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వచ్చే నెల వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలు, ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేశారు. గుంతలను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలను వందశాతం సంరక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొక్కలను నాటిన వెంటనే కంచెలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

మొక్కలను నాటేందుకు చర్యలు

ఆరో విడుత హరితహారంలో 2.56 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలోని 37 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నాం. మొక్కలను సంరక్షించేందుకు తరుచూ నర్సరీలను సందర్శించి తగు సూచనలు, సలహాలను ఇస్తున్నాం. జూన్‌లో మొక్కలను నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిఒక్కరూ భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

-రాజశేఖర్‌, ఎంపీడీవో, న్యాల్‌కల్‌ logo