ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - May 22, 2020 , 01:02:11

ఇంటి ముందుకే వైద్యసేవలు

ఇంటి ముందుకే వైద్యసేవలు

పేదల వైద్యానికి ‘బస్తీ దవాఖానలు’

జిల్లాలోని గ్రేటర్‌ పరిధిలో మూడు దవాఖానల ఏర్పాటు

నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి

రామచంద్రాపురం: పేదలకు మెరుగైన వైద్య సేవలు అం దించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదల కోసం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధి సర్కిల్‌-22లోని  ఆర్సీపురం డివిజన్‌ కానుకుంట, బండ్లగూడ, పటాన్‌చెరులోని అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో వీటిని ఏర్పాటు చేశారు.  

పేదల ముంగిటకు..  

పటాన్‌చెరు నియోజకవర్గ బస్తీవాసులకు మెరుగైన వైద్య సేవలు చేరువవుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానల్లో ఇప్పటికే సేవలందిస్తున్న ప్రభుత్వం  బస్తీవాసుల కోసం ప్రత్యేక దవాఖానలు ఏర్పాటు చేస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నాయి.  

 ఉచిత వైద్య సేవలు

బస్తీ దవాఖానల ద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఆర్సీపురంలోని కానుకుంట, చేపల బస్తీ, శ్రీనివాస్‌నగర్‌, ఎస్సీ బస్తీలు, పాషానగర్‌, భారతీనగర్‌లోని బొంబాయికాలనీ, ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియా, బండ్లగూడలో నేతాజీనగర్‌, మార్క్స్‌నగర్‌ కాలనీలు, పటాన్‌చెరులో పలు కాలనీల్లో పేదలు జీవిస్తున్నారు. నేటి నుంచి బస్తీ దవాఖానల్లో వైద్యం అందనున్నది.  

నేడు ప్రారంభించనున్న మంత్రులు

కానుకుంట, బండ్లగూడ, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హాజరుకానున్నారు. గురువారం ఏర్పాట్లను కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌, బల్దియా ఉప కమి షనర్‌ బాలయ్య పరిశీలించారు. 

మెరుగైన వైద్యం అందుతున్నది 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలతో అంటు వ్యాధులను అరికట్టవచ్చు. బస్తీల్లో నివాసముండే ప్రజలకు ఇకమీదట మెరుగైన వైద్యసేవలు అందుతాయి.  ఆర్సీపురం డివిజన్‌లోని కానుకుంట, బండ్లగూడ, పటాన్‌చెరులో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశాం.

-బాలయ్య, బల్దియా ఉప కమిషనర్‌   


logo