బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - May 21, 2020 , 00:57:55

విత్తనాల ఎంపికలో జాగ్రత్త

విత్తనాల ఎంపికలో జాగ్రత్త

అప్రమత్తతే మేలు.. 

కొనుగోలు రశీదులు తప్పనిసరి

మునిపల్లి  : వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది. విత్తనాలు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టే పనిలో కొందరు వ్యాపారులుంటారు. విత్తనాలు కొనుగోలు చేయడమే తప్ప వాటి స్థితిగతులను గమనించకపోవడంతో రైతన్నలు ఏటా నష్టాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా పత్తి, మక్కజొన్న, వరి, కంది, కూరగాయల విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో హూపమత్తంగా వ్యవహరిస్తే  అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చు.

తక్కువ ధరను నమ్మొద్దు...

వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. ఫర్టిలైజర్లు లేదా గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్వహించే దుకాణాల్లో విత్తనాలు కొంటుంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు  నకిలీ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. తక్కువ ధరకు ఇస్తుండటంతో నాణ్యత లేని విత్తనాలైనా సరే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా లాభాల సాగు చేయవచ్చు.

ఇలా చేయండి...

  • ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణం నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
  • తక్కువ ధరకు వస్తున్నాయని ప్రైవేటు వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే మొదటికే మోసం వస్తుంది.
  • విత్తనాలు కొనుగోలు చేసిన అనంతరం దుకాణాదారుల నుంచి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.
  • విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ నెంబరు, టాల్‌ నెంబర్‌ను రశీదుపై తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
  • ముందస్తుగా విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్‌పై చూసుకొని కొనుగోలు చేసి పంట పొలాల్లో విత్తుకోవాలి
  • పంటను విత్తిన తర్వాత తప్పనిసరిగా విత్తన ప్యాకెట్లను, రశీదులను భద్రపర్చుకోవాలి.
  • దుకాణాల్లో, గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే వ్యవసాయాధికారికి సమాచారమివ్వాలి.

విత్తనాలపై అవగాహన ముఖ్యం 

విత్తనాలపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలి. కొన్న ప్యాకెట్లో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రశీదులను భద్రపర్చుకోవాలి. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి.

- శివకుమార్‌, మునిపల్లి వ్యవసాయధికారి logo