శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sangareddy - May 21, 2020 , 00:44:43

సహకార సంఘాలు వారధిగా మారాలి

సహకార సంఘాలు వారధిగా మారాలి

కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రభుత్వానికి, రైతులకు వారధిగా నిలవాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా సహకార మార్కెటింగ్‌ సదస్సుకు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పీఏసీఎస్‌లు వందశాతం లైసెన్స్‌లు నేటిలోగా రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న 53 సంఘాల్లో 42 సంఘాలు రెన్యువల్‌ చేసుకున్నాయని, మిగతా సంస్థలు త్వరగా రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. రెన్యువల్‌ చేయించుకోనట్లయితే కారణం తెలుపాలని సీఈవోలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌కు కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే, లైసెన్స్‌లు ఉండి ఫర్టిలైజర్స్‌కు ఇండెంట్‌ ఇవ్వని 18 పీఏసీఎస్‌ల సీఈవోలకు నోటీసులు ఇవ్వాలని డీసీవోను ఆదేశించారు.

ఆయా సంస్థలు వెంటనే ఇండెంటు ఇచ్చి స్టాకు నేటి మధ్యాహ్నంలోగా తీసుకెళ్లాలని, ఈ విషయంలో పీఏసీఎస్‌ల చైర్మన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే, వానకాలంలో రైతులు వేయాల్సిన పంటలపై సాగు నియంత్రణ బాధ్యత పీఏసీఎస్‌ల చైర్మన్లు తీసుకొని రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. మొక్కజొన్న స్థానంలో కంది, పత్తి విస్తీర్ణాన్ని పెంచుకోవాలని ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఫర్టిలైజర్‌ను ఇప్పటి నుంచే రైతులకు చేరవేసి విత్తనాలు, ఎరువులకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సదస్సులో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ మాణిక్యం, బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ..

ప్రభుత్వం రుణమాఫీ రైతులకు ప్రకటించి ప్రయోజనం కల్పించిందని, రైతులకు త్వరగా అందేలా బ్యాంకర్లు సహకారం అందించాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో పంట రుణమాఫీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణమాఫీకి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఎంతమందికి రుణమాఫీ అయిన విషయం రైతులకు తెలియజేయాలన్నారు.

జిల్లాలో రూ.25వేల లోపు రుణమాఫీకి 17,592 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు 7048 మంది రైతు ఖాతాల్లో జమచేసినట్లు బ్యాంకర్లు నివేదికల్లో పొందుపర్చారని గుర్తుచేశారు. మిగిలిన వారి ఖాతాలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. బ్యాంకర్లు వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయాలన్నారు. రైతులు ఏవైనా సమస్యలు ఉంటే తమ ఏరియా ఏఈవోలను సంప్రదించి వెంటనే సరిచేయించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం మోహన్‌రెడ్డి, బ్యాంకర్లు, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.logo