ఆదివారం 05 జూలై 2020
Sangareddy - May 19, 2020 , 23:12:23

విత్తన వడ్లు, మక్కలు అమ్మొద్దు

విత్తన వడ్లు, మక్కలు అమ్మొద్దు

విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం

జిల్లా, మండల స్థాయిలోటాస్స్‌ఫోర్స్‌ కమిటీలు

ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేపడతాం

118 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం

నేటి సాయంత్రంలోగా తహసీల్దార్లు  స్థలాలు గుర్తించాలి

కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడే వరకు జిల్లాలో విత్తన వడ్లు, మొక్కజొన్నలు అమ్మకూడదని కలెక్టర్‌ హనుమంతరావు డీలర్లకు సూచించారు. నిబంధనలు అతిక్రమించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లు, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.  నిబంధనలకు విరుద్ధంగా వడ్లు, మొక్కజొన్న విత్తనాలు అమ్మితే డీలర్‌ షిప్‌ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇతర విత్తనాలు అమ్ముకోవచ్చని సూచించారు.

స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలి...

ఫర్టిలైజర్స్‌, ఫెస్టిసైడ్స్‌ దుకాణాల ముందు స్టాక్‌ బోర్డు, ధరల పట్టిక తప్పని సరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. జిల్లావ్యాప్తంగా అన్ని దుకాణాల్లో ఏ మేరకు విత్తనాలు, ఎరువులు ఉన్నాయో ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పరిశీలించి  నివేదికలు అందించాలని ఆదేశించారు. స్టాక్‌, ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయని డీలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న గోదాములు, లైసెన్స్‌ షాపులలో మినహా ఇతర ప్రాంతాల్లో విత్తనాలు, ఎరువులు నిలువ ఉంచితే కేసులు పెడుతామన్నారు. ఏవోలు, ఏఈవోలు తమ పరిధిలోని విత్తనాల దుకాణాలను పరిశీలించాలన్నారు. ఎరువులు, విత్తనాలు అమ్మకంపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేస్తున్నామని, మోసగించినట్లు తేలితే డీలర్లపై పీడీ యాక్ట్‌లు పెడుతామని హెచ్చరించారు.    

టాస్క్‌ఫోర్స్‌ కమిటీలచే ముమ్మర తనిఖీలు...

రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ సాగు విధానాన్ని అమలు చేస్తున్న తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు  కీలక పాత్ర పోషించాల్సి ఉందని కలెక్టర్‌ అన్నారు.  సాగు విధానాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. 

118 క్లస్టర్లలో రైతు వేదికలకు స్థలాలు..

జిల్లావ్యాప్తంగా 118 వ్యవసాయ క్లస్టర్లలో రైతుల వేదికలకు స్థలాలు సేకరించాలని కలెక్టర్‌ హనుమంతరావు తహసీల్దార్లను ఆదేశించారు. ఒక్కో వేదిక నిర్మాణానికి 20 గుంటల స్థలాన్ని కేటాయించాలన్నారు. బుధవారం సాయంత్రంలోగా అనువైన స్థలాలను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులకు స్వాధీనం చేయాలని, నిర్మాణాలను త్వరగా పూర్తి  చేయాల్సి ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్డీవో రాధిక రమణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, ఆర్డీవో నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo