శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - May 18, 2020 , 23:44:02

వారం రోజులు.. రూ.3.88కోట్లు

వారం రోజులు.. రూ.3.88కోట్లు

భూ రిజిస్ట్రేషన్లతో సర్కారుకు భారీగా ఆదాయం

ఉమ్మడి జిల్లాలో 15 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సడలింపులతో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌చేసుకున్న వారికి డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో మొత్తం 15 వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ప్రభుత్వం కల్పించిన సడలింపులతో ఈ నెల 8 నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సెలవు రోజులు మినహాయిస్తే, ఈ వారం రోజుల వ్యవధిలో అన్ని కార్యాలయాల్లో కలిపి మొత్తం 3,229 డాక్యుమెంట్లు పూర్తి చేయగా, అత్యధికంగా సంగారెడ్డి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 514 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా, మొత్తం డాక్యుమెంట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3.88 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.


సంగారెడ్డిలో అధికంగా..

ఉమ్మడి జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుండగా, ఈ నెల 8 నుంచి 16 శనివారం వరకు మొత్తం 3,229 డాక్యుమెంట్లు పూర్తి చేశారు. ఇందులో అత్యధికంగా సంగారెడ్డి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 514 రిజిస్టేషన్లు జరిగాయి. అతి తక్కువగా సిద్దిపేట రూరల్‌ కార్యాలయంలో 111 డాక్యుమెంట్లు చేశారు. ఇక ఆదాయం విషయానికొస్తే, అధికంగా ఈ నెల 14న అన్ని కార్యాలయాల్లో 498 రిజిస్ట్రేషన్లు జరుగగా, రూ.66.52 లక్షల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్లు మాత్రం ఈ నెల 13న అత్యధికంగా 500 వరకు అయ్యాయి. కార్యాలయాలు తెరుచుకున్న 8వ తేదీ నుంచి మొదటి రోజు మినహా మిగతా రోజుల్లో 400 నుంచి 500 వరకు వరకు డాక్యుమెంట్లు పూర్తవుతున్నాయి. 


స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే..

లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం కల్పించిన సడలింపులతో చేపట్టిన రిజిస్ట్రేషన్లలో ముందు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌చేసుకున్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. అక్కడ లాక్‌డౌన్‌ ఆదేశాలు పాటించిన వారికే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అంటే తప్పని సరిగా మాస్క్‌ ధరించాలి, శానిటైజర్‌, సోప్‌వాటర్‌తో చేతులు కడుక్కోవాలి. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఒకరికొకరు భౌతిక దూరం పాటించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై కార్యాలయ సిబ్బంది సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిపి వేసి, అలాంటి వారిని తిరిగి పంపిస్తున్నారు. 
వారం రోజుల్లో 3వేలకు పైగా..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. లాక్‌డౌన్‌ తర్వాత 8 నుంచి కార్యాలయాలు తిరిగి ప్రారంభం కావడంతో, నిబంధనలు పాటిస్తున్నారు. అన్ని కార్యాలయాల వద్ద శానిటైజర్‌, సోప్‌ వాటర్‌ అందుబాటులో ఉంచాం. చేతులు శుభ్రం చేసుకుని, మాస్క్‌ ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నాం. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారి డాక్యుమెంట్లు మాత్రం పూర్తి చేస్తున్నాం. వారం రోజుల్లో 3 వేలకు పైన డాక్యుమెంట్లు చేశాం.

- రమేశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌


logo