గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - May 14, 2020 , 22:37:51

లాక్‌డౌన్‌లో ఉపాధి

లాక్‌డౌన్‌లో ఉపాధి

  • అన్ని గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు 
  • అడిగిన వెంటనే జాబ్‌కార్డులు
  • తెల్లకాగితం మీద దరఖాస్తు చేసుకున్నా సరే..

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ‘ఉపాధి’ కల్పిస్తూ అండగా నిలుస్తున్నది. లాక్‌డౌన్‌లో సైతం గ్రామీ ణ ప్రాంతాల వారిని ఆదుకుంటున్నది. ఒక్కో వ్యక్తికి రూ.237 చొప్పున రోజు కూలి చెల్లిస్తుండగా, వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు లు జమ చేస్తున్నది. తమకు పని కావాలని అని అడిగిన ప్రతిఒక్కరికీ అధికారులు పనులు చూపిస్తున్నారు. తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకున్నా సరే జాబ్‌కార్డు జారీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 పంచాయతీలుండగా, ప్రస్తుతం 618 గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

7409 కొత్త జాబ్‌కార్డుల జారీ..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోతుండగా, గ్రామాల్లో పేదలు పనిలేకుండా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభు త్వం గుర్తించింది. గత ఏప్రిల్‌ 1 నుంచి అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఉపాధి పనులు చేసుకునే అవకాశం కల్పించింది. 2006 నుంచి 30 మార్చి 2020 వరకు 2,34,828 జాబ్‌కార్డులుండగా, అందులో 4,73,139 మంది సభ్యులు ఉండేవారు. ఈఏప్రిల్‌ 1 నుంచి 13 వరకు జిల్లా వ్యాప్తంగా కొత్తగా దరఖాస్తులు రాగా, 7409 జాబ్‌కార్డులను అధికారులు జారీ చేశారు. ఈ కార్డుల్లో మొత్తం 16,501 మంది సభ్యులున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 647 పం చాయతీలుండగా, ప్రస్తుతం 618 గ్రామాల్లో ఉపాధి పను లు కొనసాగుతున్నాయి. 1,35,708 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం పనిచేసిన వారికి రోజువారీగా రూ.237 వరకు వేతనం అందిస్తున్నారు. ఉపాధి కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జోరుగా గ్రామాల్లో పనులు

ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. గురువారం నిజాంపేట మండలం నందిగామలోని సాయిచెరువు వద్ద జరుగుతున్న ఉపాధి పనులను పం చాయతీ కార్యదర్శి మహమ్మద్‌ ఆరిఫ్‌ హుస్సేన్‌ పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు నీడ కోసం టెంట్‌, మంచి నీళ్ల సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లి, యావాపూర్‌, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్‌, నాగులపల్లి, వట్టూర్‌ తదితర గ్రామాల్లో కూలీలు పనుల్లో నిమగ్నమయ్యారు.

మెదక్‌లో 3.82లక్షల మంది కూలీలు

మెదక్‌, నమస్తే తెలంగాణ: మెదక్‌ జిల్లాలో మొత్తం 3 లక్షల 82 వేల 958మంది ఉపాధి కూలీలుండగా, లక్షా 69 వేల 221 జాబ్‌ కార్డులున్నాయి. కొత్తగా జాబ్‌ కార్డులు పొంది ఉపాధి పనులు చేస్తున్న వారి సంఖ్య 929 అని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీల సంఖ్య 54 వేల 485 మంది ఉన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఉదయం పూటనే  చెరువులు, కుంటల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

ఊరిలోనేఉపాధి..

నేను బీటెక్‌ చదువుకొని  టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఖాళీగా ఉంటున్నా. పైగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఉండడంతో 45 రోజుల నుంచి ఇంటి వద్దే ఉన్నా. ఖర్చుల కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా. ఇక్కడ చేసే పనికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఊర్లోనే ప్రజల మేలు కోసం చేస్తున్న పనిగా భావించి, గర్వపడుతున్నాను.

- తోట రమేశ్‌, ఝరాసంగం 

ఆదుకుంటున్నది..

నేను ఆటో నడుపుతా. లాక్‌డౌన్‌తో బయట ఎలాంటి పనుల్లేక మొదట్లో ఇబ్బందులు పడ్డా. దీంతో గ్రామంలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు వెళ్తున్నా. పని ద్వారా వచ్చిన డబ్బులు అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అధికారులు కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పని కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

- ఆర్‌. బాల్‌రాజ్‌, ఆటో డ్రైవర్‌, ఝరాసంగం


మా తప్పు మన్నించండి విధుల్లోకి తీసుకోండి


‘తెలిసి.. తెలియక సమ్మెలోకి వెళ్లాం.. మా తప్పును మన్నించండి.. తిరిగి విధుల్లోకి తీసుకోండి’..అని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు వేడుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు వినతి పత్రాలు అందజేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మార్చి 12 నుంచి 22వ తేదీ వరకు సమ్మె చేసి, అనంతరం విరమించుకున్నామని, తమను తిరిగి విధుల్లో తీసుకోవాలని విన్నవించారు. logo