శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - May 10, 2020 , 00:55:03

రైతన్నకు రుణ విముక్తి

రైతన్నకు రుణ విముక్తి

  • రూ.25వేలలోపు రుణమాఫీకి జిల్లాకు రూ.32 కోట్లు    
  • జిల్లాలో 13వేల మందికి లబ్ధి 
  • విడుతల వారీగా మాఫీ కానున్న లక్షలోపు రుణాలు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీకి నిధులను విడుదల చేసింది. మొదటి విడుతలో రూ.25 వేలు ఉన్న బ్యాంకు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయనుండగా జిల్లాకు రూ.32 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లాలోని 13 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. రూ.లక్ష లోపు ఉన్న బ్యాంకు రుణాలను దశలవారీగా ప్రభుత్వం మాఫీ చేయనున్నది. ఇందులో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు రుణమాఫీ పొందే రైతుల జాబితాను రూపొందిస్తున్నారు.  రుణమాఫీతో జిల్లావ్యాప్తంగా 83,000 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే ‘రైతుబంధు’తో ఎకరానికి రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండగా, రుణమాఫీ కానుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు 70వేల మంది

మెదక్‌ జిల్లాకు వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేర్కొం ది. నిరంతర విద్యుత్‌తో పాటు ఘణపురం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం మంజీరా నది పొడవునా రెండు పంటలు పండుతున్నాయి. జిల్లాలో 2లక్షల 45వేల మంది రైతులు ఉన్నప్పటికీ 70వేల మంది రైతులు రూ.ల క్ష లోపు రుణాలు తీసుకున్నారు. వీరికి రూ.670కోట్ల రుణం మాఫీ కానున్నది. ఈ రుణమాఫీకి సంబంధించిన చెక్కులను ప్రభుత్వం రైతులకు నేరుగా అందించనున్నది.