బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - May 09, 2020 , 00:26:02

సడలింపు.. సౌకర్యం

సడలింపు.. సౌకర్యం

  • లాక్‌డౌన్‌ సడలింపుతో జిల్లాల్లో మొదలైన సందడి 
  • కొనసాగుతున్న వ్యవసాయ అనుబంధ పనులు
  • తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు
  • ఆనందంలో వివిధ వర్గాలు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన స డలింపులతో పలు కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. మార్చి 22న దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ నిర్వహించగా మరుసటి రోజు 23 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. కాగా, సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అంశంలో పలు సడలింపులిచ్చింది. ఇందులో మద్యం అమ్మకాలతో పాటు రైతాంగ అనుబంధ దుకాణాలు, వాహన, భూ రిజిస్ట్రేషన్లు ఇతర వ్యాపార సంస్థలు తెరుచుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతాంగంతో పాటు ఇతర వర్గాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. రెండు రోజులుగా అన్ని అనుమతి పొందిన సంస్థలు, కార్యాలయాల్లో సందడి నెలకొన్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లో భూ రిజిస్ట్రేషన్లు తిరిగి మొదలయ్యాయి. ఆయా కార్యాలయాల వద్ద తమ పనులు చేయించుకుంటున్నారు. అలాగే సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, మెదక్‌, సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ ప్రక్రియ కొనసాగుతున్నది. సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో రెండు రోజులుగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరుగలేదు. కాగా, గురువారం 33 రిజిస్ట్రేషన్లు జరుగగా, శనివారం లర్నింగ్‌ 15, పర్మినెంట్‌ లైసెన్సు 9, ఫిట్‌నెస్‌ 3, వాహనాల రిజిస్ట్రేషన్‌ 3 ఇతర లావాదేవీ లు 24 జరిగినట్లు ఆర్టీఏ ఉమ్మడి జిల్లా కమిషనర్‌ శివలింగయ్య తెలిపారు. అలాగే భూములు ఇతర రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. రెండు రోజులుగా దాదాపు 70 భూ, మార్టిగేజ్‌ ఇతర రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే మాస్కులు లేనిదే ఎవరిని కూడా ఆయా కార్యాలయ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. అలాగే భౌతిక దూరాన్ని పాటించేలా ముగ్గులు వేసి శానిటైజర్‌ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ట్రాక్టర్ల విడిభాగాలు, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన ఫర్టిలైజర్‌ షాపులు తెరుచుకోవడంతో రైతులు తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో దాదాపు 40 రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రభుత్వం కల్పించిన సడలింపులతో తిరిగి యథావిధిగా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యామని రైతులు చెబుతున్నారు. తమ దుకాణాలు తెరుచుకుని రోజువారీగా పని చేసుకుంటున్నామని చిరువ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మ డి జిల్లాలో 193 వైన్స్‌లుండగా, అనుమతించిన మొదటి రోజు మాత్రమే వైన్స్‌ల ఎదుట క్యూ కనిపించగా, శుక్రవారం అన్ని దుకాణాల ఎదుట సాధారణ పరిస్థితి కనిపించింది. అన్ని మద్యం దుకాణాల ముందు ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించిన మద్యం ధరల పట్టికను ప్రదర్శించారు. సడలింపులతో తామంతా పనులు చేసుకుంటున్నామని వివిధ వర్గాల వారు పేర్కొన్నారు.

సడలింపు ఊరటనిచ్చింది..

ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపునివ్వడంతో మేము గ్యారేజీ షాప్‌ ఓపెన్‌ చేసుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకుంటున్నాం. నిన్న మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం.. సడలింపుతో మాకు సంతోషంగా ఉంది. పనులు చేసుకుంటున్నాం.

- చంద్రం, ట్రాక్టర్‌ మెకానిక్‌, సిద్దిపేట

వ్యాపారం తిరిగి ప్రారంభమైంది..

సడలింపు ఇవ్వడంతో దుకాణం తెరిచా. దుకాణాల వద్దకు వచ్చే వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నాం. కచ్చితంగా మాస్క్‌లు పెట్టుకోవాలని చెబుతున్నాం. దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం సార్‌ చెప్పడం సంతోషంగా ఉంది. రాష్ర్టాన్ని నడుపాలంటే ప్రభుత్వానికి కూడా పైసలు అవసరం కదా. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లలో సడలింపు ఇచ్చి మంచి పని చేశారు.

- శరణప్ప, హార్డ్‌వేర్‌ దుకాణ యజమాని, ఆర్సీపురం


సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం

సీఎం కేసీఆర్‌ సార్‌ లాక్‌డౌన్‌ను కొంత వరకు సడలించడంతో రైతులందరం వ్యవసాయ పనులు చేసుకుంటున్నం. వానకాలం దగ్గర పడటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు ఇచ్చింది. నాగళ్లు, పని ముట్లను సిద్ధం చేసుకుంటున్నం. వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్‌ సార్‌ మంచిగా చూస్తుండటంతో సంతోషంగా ఉంది.

- ర్యాకం కిష్టయ్య, రైతు, మిరుదొడ్డి

ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం కల్పించాలి

45 రోజులు దుకాణం మూసిఉంచాం. గురువారం సరి, బేసి విధానంలో దుకాణాలు తెరవాలని ప్రభుత్వ ఆదేశాలు సంతోషాన్ని ఇచ్చింది. దుకాణం తెరిచి ఉంచినా గిరాకీ అంతంతే ఉంది. సిమెంట్‌, స్టీల్‌ రవాణాకు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటది. అన్ని రకాల దుకాణాలు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే వ్యాపారాలు యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది.

- మాణిక్‌ ప్రభు, స్టీల్‌, సిమెంట్‌ దుకాణం, సంగారెడ్డి

సడలింపు మంచిదే..

లాక్‌డౌన్‌ సడలింపు మంచిదే. గురువారం నుంచి ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 50శా తం దుకాణాలు తెరవాలని ఆదేశా లిచ్చింది. దుకాణాలు తెరిచి ఉంచి నా గిరాకీ లేదు. ఈ పరిస్థితి మారి సాధారణ స్థాయికి చేరుకుంటే అ న్ని వ్యాపారాలు సాగుతాయి.

- ద్వారక రవి, బట్టల దుకాణం, సంగారెడ్డి


logo