సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - May 07, 2020 , 00:34:00

మద్యం అమ్మకాలు, భూ రిజిస్ట్రేషన్లు షురూ

మద్యం అమ్మకాలు, భూ రిజిస్ట్రేషన్లు షురూ

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు, భూ, వాహన రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 10గంటలకు షాపులు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. భూ, వాహన రిజిస్ట్రేషన్లు తిరిగి మొదలవ్వగా, మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉండగా, సంగారెడ్డి, మెదక్‌ ఆరెంజ్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి. మద్యం విషయానికొస్తే, ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డిలో 85, సిద్దిపేట 70, మెదక్‌లో 38 మొత్తం 138 వైన్స్‌లున్నాయి. మూడు జిల్లాల్లో ఉదయం 10 గంటలకు వైన్స్‌లు తెరుచుకోగా, మందుప్రియులు క్యూకట్టి మద్యం తీసుకున్నారు. స్థానిక పోలీసులు క్యూ పద్ధతిలో మద్యం తీసుకునేలా పర్యవేక్షించారు. వైన్స్‌ షాపుల ఓనర్లు లేకపోవడం, ఇతర కారణాలతో సిద్దిపేట జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 3 దుకాణాలు మొదటి రోజు మూసి ఉన్నట్లు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి తెలిపారు. ఇదిలా ఉండగా, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాల్లో వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. వాహన టాక్స్‌లు కూడా తీసుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, మెదక్‌, సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ ఆర్టీఏ కార్యాలయాల వద్ద మొదటి రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా కొనసాగింది. అలాగే మూడు జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. మార్చి 22న జనతా కర్యూ జరుగగా, ఆ మరుసటి రోజు 23 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ది. అప్పటి నుంచి వైన్స్‌లు, వాహన, భూముల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు మూసేశారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగించగా, తాజాగా సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించారు. వ్యవసాయ అనుబంధం గా ఉండే ఫర్టిలైజర్స్‌, విత్తనాలు, ట్రాక్టర్‌ స్పేర్‌ పార్ట్స్‌, భవన నిర్మాణ రంగానికి సంబంధించిన ఎలక్ట్రికల్స్‌, సిమెంట్‌, ఐరన్‌ దుకాణా లు తెరిచేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా దుకాణాలు బుధవారం తెరుచుకున్నాయి. అన్ని చోట్ల ప్రజ లు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కనిపించారు. పోలీసులు ముందస్తుగానే మద్యం దుకాణాల వద్దకు చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి, సామాజిక దూరంలో క్యూలైన్‌లో నిలబడి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. 16శాతం పెంచి విక్రయాలు జరిపారు.


logo