మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - May 04, 2020 , 00:43:44

సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌

సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌

  • అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి  

నారాయణఖేడ్‌/ జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ/ న్యాల్‌కల్‌ : నారాయణఖేడ్‌ డివిజన్‌లోని రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని అధికారులను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజేశ్వర్‌, డీఎస్పీ సత్యనారాయణరాజు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు, కార్మికులను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం పంపిస్తుందన్నారు. వలస కూలీలు, ఉద్యోగులు వారి రాష్ట్రాలకు వెళ్లడానికి ఆధార్‌కార్డు, ఇతర పత్రాలు పరిశీలించి అనుమతి ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రతి గ్రామంలో ఆహార సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జహీరాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టుతోపాటు న్యాల్‌కల్‌ మండలంలోని గణేష్‌పూర్‌ శివారు చెక్‌పోస్టును అదనపు కలెక్టర్‌ తనిఖీ చేశారు. స్వస్థలాలకు వెళ్లేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దవాఖానకు తరలించాలని ఆదేశించారు. ఇతరరాష్ర్టాలకు వలస వెళ్లి.. తిరిగి వస్తున్నవారి వివరాలను జిల్లా అధికారులకు పంపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో ఆర్డీవో రమేశ్‌బాబు, తాసిల్దార్లు నాగేశ్వర్‌రావు, శ్రీశైలం, రవాణా శాఖ అధికారులు శ్రీనివాస్‌గౌడ్‌, అశ్వంత్‌కుమార్‌, ఎస్‌ఐ గణేశ్‌తో సమావేశమయ్యారు. అలాగే, న్యాల్‌కల్‌లో రెవెన్యూ అధికారి రాధాబాయి, రూరల్‌ సీఐ కృష్ణకిశోర్‌, హద్నూర్‌ ఎస్‌ఐ విజయ్‌రావు, మిర్జాపూర్‌(బీ) పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రశాంతి, ఇతర అధికారులతో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి మాట్లాడారు.


logo