శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - May 04, 2020 , 01:02:25

వానకాలం సాగుకు సిద్ధం

వానకాలం సాగుకు సిద్ధం

  • సంగారెడ్డి జిల్లాలో 2,83,746 హెక్టార్లు.. మెదక్‌ జిల్లాలో 2,34,800 ఎకరాలు.. 

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/మెదక్‌, నమస్తే తెలంగాణ: వానకాలం పంటలు సాగుచేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ పంటలు ఎంత మేరకు సాగు చేయాలన్న నివేదికలను అధికారులు తయారు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 2,83,746 హెక్టార్లు, మెదక్‌ జిల్లాలో 2,34,800 ఎకరాల్లో పంటల సాగు చేయనున్నట్లు ఇరుజిల్లాల అధికారులు నివేదికలను తయారు చేశారు. ప్రధానంగా ఈ వానకాలం సీజన్‌లో వరి, మొక్కజొన్న, సోయాబీన్‌, శనగ, వేరుశనగ, పత్తి పంటలతో పాటు ఇతర పంటలను సాగు చేయనుండగా, సంగారెడ్డిలో జిల్లాలో పత్తి, మెదక్‌ జిల్లాలో వరి సాగుపై రైతులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 12,895 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేశారు. 1,16,428 మెట్రిక్‌ టన్నుల ఎరువులను మాసాల వారీగా అందుబాటులో ఉంచారు. మెదక్‌ జిల్లాకు 28,600 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అంచనాలు సిద్ధం చేశారు. డీఏపీ 4,830 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,259 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 3,703 మెట్రిక్‌ టన్నులు, 12,590 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఎక్కువ మొత్తంలో యూరియాను అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఎరువులు సిద్ధం..

వానకాలం సాగుకోసం సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాం.  దుక్కులు చదును చేసుకుని వర్షాలు రాగానే అందజేస్తాం. పంటల వివరాలను సేకరించి అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాం. యూరియా 38,834 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 15,197, ఏంవోపీ 18,824, కాంప్లెక్స్‌ 34,835, ఎస్‌ఎస్‌పీ 8,738 మొత్తం 11,6428 మెట్రిక్‌ టన్నులను కేటాయించాం. వానకాలం సాగుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేశాం.

 - నర్సింహారావు, సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖాధికారి 

అందుబాటులో విత్తనాలు..

వానకాలం సీజన్‌కు సంబంధించి విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచాం. జిల్లాలో ఈ వానకాలంలో 2 లక్షల 34వేల 800 ఎకరాల్లో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారు. జిల్లాకు 28,600 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని అంచనాలు సిద్ధం చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే విత్తనాల సబ్సిడీ వివరాలను వెల్లడిస్తాం.

-పరుశురాంనాయక్‌, మెదక్‌ జిల్లా వ్యవసాయ అధికారి