శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Apr 12, 2020 , 23:45:05

రాకపోకలు బంద్‌

రాకపోకలు బంద్‌

  • రాష్ట్ర సరిహద్దుల వద్ద పూర్తిగా నిషేధం
  • కర్ణాటక సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులు
  • నిరంతరం ముమ్మర తనిఖీలు
  • మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు
  • మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలతో జిల్లావాసుల సన్నిహిత సంబంధాలు
  • రాకపోకలు పూర్తిగా అరికట్టిన పోలీసులు
  • సరుకు రవాణా వాహనాలకే అనుమతి  

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పొరుగున మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ రాష్ట్రం నుంచే మన రాష్ట్రంలోకి వచ్చే సరిహద్దుల వద్ద కట్టుదిట్టం చేశారు. అత్యవసరమైనవి, సరుకు రవాణా వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కంగ్టి మండలానికి సమీపంలోనే కర్ణాటక సరిహద్దు ఉండగా అక్కడికి సమీపంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉన్నది. రెండు రాష్ర్టాల సరిహద్దు గ్రామాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోపాటు వ్యాపారం కూడా కొనసాగుతున్నది. ఈ క్రమంలో వ్యాధి వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉందని భావించి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కేవలం గూడ్స్‌ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని, సరిహద్దు రాష్ర్టాల నుంచి ప్రజల రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో మరో 15 రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. 

సమీపంలోనే మహారాష్ట్ర గ్రామాలు: జిల్లాకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు మాత్రమే ఉన్నప్పటికీ కర్ణాటకలోని కొన్ని గ్రామాల సమీపంలోనే అంటే దాదాపు 15 కిలోమీటర్లలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉన్నది. ఈ రెండు రాష్ర్టాల సరిహద్దు గ్రామాల నుంచి జిల్లాలోని నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రజలకు బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. కంగ్టి మండలం దెగుల్‌వాడి గ్రామ శివారును ఆనుకొని కర్ణాటక గ్రామాలున్నాయి. బీదర్‌ జిల్లా ఔరంగాబాద్‌ తాలూకాలోని నాగన్‌పల్లి, చింతాకి, సుందాల్‌, ఉజని, సుంకనాల్‌ గ్రామాలు మనకు కేవలం ఏడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోనే మహారాష్ట్రలోని ఏడూరు, మానురు, బిజల్‌వాడి, కొక్కల్‌గావ్‌, హనేగావ్‌ గ్రామాలున్నాయి. నాగల్‌గిద్ద మండలంలోని కరస్‌గుత్తికి ఐదు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దు ఉన్నది. బీదర్‌ జిల్లాలోని జంగి, చిల్లరితోపాటు పలు తండాలు ఉంటాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

సరిహద్దులో చెక్‌పోస్టులు: తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వాహనాల రాకపోకలను అరికట్టడంలో భాగంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై జహీరాబాద్‌ సమీపంలోని గంగ్వార్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. మొగుడంపల్లి మండలం గౌసాబాద్‌, కోహీర్‌ మండలం గోటిగార్‌పల్లి, మనియార్‌పల్లి, న్యాల్‌కల్‌ మండలం మాల్గి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. కంగ్టి మండలం నాగూర్‌ వద్ద రహదారికి అడ్డంగా కందకం తవ్వి రాకపోకలు నిలిపివేశారు. నాగల్‌గిద్ద మండలం మోర్గి వద్ద కూడా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కూరగాయలు, పాలు, ఇతర గూడ్స్‌ వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. 

మహారాష్ట్రలో కరోనా ఉధృతి: మహారాష్ట్రలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే సరిహద్దుల వద్ద భద్రత పటిష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ఈనెల 30 వరకు పొడిగించిన సీఎం కేసీఆర్‌, సరిహద్దుల వద్ద కఠినంగా వ్యవహరించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనితో కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా చర్యలను పటిష్టం చేశారు. రోజువారిగా చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తుండగా సరిహద్దు గ్రామాల మధ్య రాకపోకలు లేకుండా రోడ్లను తవ్వారు. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది చెక్‌పోస్టుల వద్ద ఉండి ఎవరైనా ఇతర కారణాలతో అనుమతితో వచ్చినా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్‌ 30 వరకు ప్రయాణాలు బంద్‌ 

లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలు ఉండవు. పనులు ఉన్నప్పటికీ ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు. కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం. కర్ణాటక సరిహద్దులో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. గూడ్స్‌ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నాం. ఆటోలు, జీపు, బైక్‌లు ఇలా ఏ వాహనాన్ని వెళ్లనివ్వడం, రానివ్వడం లేదు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో భద్రతను మరింత పటిష్టం చేశాం.

- చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ, సంగారెడ్డి 


logo