మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Apr 12, 2020 , 00:08:08

అనవసరంగా రోడ్డెక్కితే క్వారంటైన్‌కు పంపిస్తాం

అనవసరంగా రోడ్డెక్కితే క్వారంటైన్‌కు పంపిస్తాం

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని,అదే క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కలెక్టర్‌ మీడియాతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలీసు అధికారులు ఎంత చెప్పినా కొంతమంది యువకులు అసవసరంగా రోడ్లపైకి వచ్చినవారిని  గుర్తించినట్లు చెప్పారు. ఇక మీదట అలాంటి వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేసి, వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు. నిత్యావసర సరుకులు, ఇతర అవసరాల కోసం బయటకు వచ్చే వారు మాస్క్‌ లేకుండా బయట కనిపించే వారికి జరిమానాలు విధించి, కేసులు కూడా నమోదు చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి కలెక్టర్‌ సూచించారు. జిల్లా పరిధిలోని జహీరాబాద్‌లో 2, సంగారెడ్డి పట్టణంలో 2, అంగడిపేటలో 2, కొండాపూర్‌లో 1 మొత్తం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురంలో మరో 2 కేసులున్నాయన్నారు. 9 కేసులు నమోదైన ప్రాంతాలను 7 కంటైన్మెంట్‌ ఏరియాలుగా విభజించామని, బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా కాలనీ నుంచి రాకపోకలను నియంత్రించామని చెప్పారు. ఆయా కాలనీ పరిధిలోని 13 వేల ఇండ్లను దాదాపు 150 మందితో కూడిన వైద్య బృందాలు తమ ఆధీనంలోకి తీసుకుని రోజు వారీగా స్థానికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి 267 మంది వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నెల 21, మరికొందరు 28 వరకు క్వారంటైన్‌లో ఉంటారు. పాజిటివ్‌ ఉన్న 9 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఎస్పీతో కలిసి రోజువారీగా సమీక్ష ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ 08455-272525 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే స్థానికులను ఇబ్బంది పెడుతున్న వారి గురించి, మర్కజ్‌ నుంచి వచ్చి ఎవరికి సమాచారం లేకుండా తిరుగుతున్న వారి సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. అలాగే వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించి పాలు, కూరగాయల తరలింపు, ఇతర ఇబ్బందులుంటే 08455-276466 నెంబర్లకు ఫోన్‌ చేస్తే అధికారులు స్పందిస్తారని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.


logo