సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Apr 03, 2020 , 01:37:00

ఢిల్లీ కలవరం

ఢిల్లీ కలవరం

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఢిల్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన  వారిలో కరోనా లక్షణాలు ఉండడం, కొంతమందికి పాజిటివ్‌ రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా నుంచి 21 మంది వరకు మర్కజ్‌కు వెళ్లినట్లు గుర్తించి, అందరినీ సంగారెడ్డి సమీపంలోని క్వారంటైన్‌కు తరలించారు. పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో కొండాపూర్‌, జహీరాబాద్‌ మండలాలకు చెందిన ఇద్దరు, సంగారెడ్డికి చెందిన నలుగురు ఉన్నారు. వీరందరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వీరి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఇప్పటికే సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కాగా, వీరు కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. ఒకేరోజు ఆరు కేసులు నమోదుకావడంతో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అప్రమత్తమయ్యారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చిన వాహనాలను సీజ్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. 

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై నిఘా పెట్టాలి : మంత్రి హరీశ్‌రావు

ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మంత్రి హుటాహుటిన సంగారెడ్డికి వచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో సమీక్షించి, అనంతరం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈనెల 15 వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సామాజికదూరం పాటించాలని కోరారు. ఢిల్లీ ప్రార్థనల్లో జిల్లా నుంచి 21 మంది వెళ్లొచ్చినట్లు సమాచారముందని, అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్‌ఆర్‌ దవాఖానలోని క్వారంటైన్‌లో ఉన్నవారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గజ్వేల్‌లో మంత్రి, ఎంపీ పర్యటన  

గజ్వేల్‌ వాసికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ వ్యక్తి ఉండే ప్రాంతాన్ని రసాయనాలతో శుద్ధి చేస్తున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, అధికారులతో కలిసి మంత్రి గజ్వేల్‌లో పర్యటించారు. 30 ప్రత్యేక బృందాల ద్వారా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతుండగా, ఆయన కుటుంబసభ్యులతోపాటు సన్నిహితంగా ఉన్న 12 మంది రక్తనమూనాలు పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ముగ్గురి రిపోర్టులు కూడా త్వరలో వస్తాయని, వాటి ఆధారంగా తగిన చర్యలు చేపడుతామన్నారు. పలువురి ఇండ్ల వద్దకు వెళ్లిన మంత్రి, వ్యాధి లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే అధికారులకు సమాచారమివ్వాలన్నారు. సామాజిక దూరం, స్వీయ నిర్బంధంపై అవగాహన కల్పించారు. అంతకుముందు అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, ఏసీపీ నారాయణ, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 


logo