గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Mar 31, 2020 , 23:21:40

సమిష్టిగా కరోనాను కట్టడి చేద్దాం

సమిష్టిగా కరోనాను కట్టడి చేద్దాం

నారాయణఖేడ్‌, నమస్తేతెలంగాణ/ కల్హేర్‌ : ప్రతిఒక్కరూ బాధ్యతగా కరోనా వైరస్‌ను కట్టడి చేద్దామని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. మంగళవారం నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ రాజర్షిషాలతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ ముందుజాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో 19 మంది అనుమానితులను గాంధీకి తరలించగా, ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశామని, ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వచ్చిన జిల్లావాసులు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు 595 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారని, వారు తమ రాష్ర్టాలకు వెళ్లే ప్రయత్నం చేయకుండా ఇక్కడే ఉండాలన్నారు. బుధవారం నుంచి రేషన్‌షాపుల ద్వారా 12 కిలోల బియ్యం, రూ.1500 అందిస్తామన్నారు. రేషన్‌ దుకాణాల వద్ద సామాజికదూరం పాటించాలని ప్రజలకు సూచించారు. ఉల్లి రైతులు హైదరాబాద్‌లో తమ ఉత్పత్తులు విక్రయించేలా పాస్‌లిస్తామని, ఈనెల రెండోవారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. కాగా మున్సిపల్‌ పనితీరు, మిషన్‌ భగీరథ పనులు, పశుసంవర్ధకశాఖ ద్వారా పశువులు, పౌల్ట్రీఫారాలకు దాణా సరఫరా తదితరాంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రుబినాబేగం నజీబ్‌,అధికారులు పాల్గొన్నారు. అనంతరం కల్హేర్‌ మండలం బాచేపల్లిలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరలో మనూరులో శనగలు, నారాయణఖేడ్‌, సిర్గాపూర్‌, కల్హేర్‌లలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.  logo