ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Mar 31, 2020 , 23:09:16

ఢిల్లీ వెళ్లొచ్చిన 38 మంది గుర్తింపు

ఢిల్లీ వెళ్లొచ్చిన 38 మంది గుర్తింపు

అందోల్‌/ నర్సాపూర్‌, నమస్తేతెలంగాణ/ తూప్రాన్‌ రూరల్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన మత ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లొచ్చిన 38 మందిని గుర్తించామని, వారందరిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం జోగిపేట మున్సిపల్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన, ఎంఎన్‌ఆర్‌ వైద్య దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులలో పరిశీలిస్తున్నామని, వీరిలో నలుగురికి దగ్గు, జలుబు, జ్వరం ఉండడంతో గాంధీకి తరలించి పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. 38 మందితోపాటు వారి 149 మంది కుటుంబసభ్యులను, వారిని కలిసిన 48 మందిని గృహ నిర్బంధం చేసి నిఘా ఉంచామన్నారు.అందోలు నియోజకవర్గంలో 19 మంది విదేశాల నుంచి రాగా 18 మందికి 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిందని, వీరందరికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు చెప్పారు. జిల్లాలో 91 ధాన్యం, 6 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాయికోడ్‌, వట్‌పల్లిలో శనగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించామని, టోకెన్ల ప్రకారమే రైతులు కేంద్రాల వద్ద విక్రయించాలన్నారు. పండ్లు, కూరగాయలు, పాలు విక్రయించే వారికి పాస్‌లు అందజేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో కార్మికులకు మాస్క్‌లు, గ్లౌజులివ్వాలని, పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. సమీక్షలో జహీరా బాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, జడ్పీ సీఈవో రవి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య తదితరులున్నారు. అనంతరం అందోలు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఒకనెల వేతనాన్ని సీఎం సహాయనిధికి అందిస్తూ మంత్రి హరీశ్‌రావుకు అంగీకారపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో జరుగుతున్న రసాయన మందు పిచికారిని మంత్రి ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధాన రహదారులతోపాటు అన్ని వీధుల్లోనూ స్ప్రే చేయించాలన్నారు. మంత్రికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మాస్క్‌ను అందజేశారు. 

సామాజిక దూరం పాటించాలి: సిద్దిపేట,గజ్వేల్‌ తరహాలో తూప్రాన్‌, నర్సాపూర్‌ పట్టణాల్లో రసాయన మందును పిచికారి చేయించాలని మున్సిపల్‌ చైర్మన్లు మురళీయాదవ్‌, రాఘవేందర్‌గౌడ్‌లకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. నారాయణఖేడ్‌ పర్యటనకు వెళ్తూ తూప్రాన్‌, నర్సాపూర్‌ పట్టణాల్లో కాసేపు ఆగారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై అడ్డగోలుగా తిరుగకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు గట్టిగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. వలసొచ్చిన కూలీలకు 12 కిలోల బియ్యం,రూ.500 నగదు ఉచితంగా ఇస్తున్నామన్నారు.  


logo