సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Mar 30, 2020 , 00:19:54

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

  • లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలి
  • ఏప్రిల్‌ నుంచి ఉచిత బియ్యం, రూ.1500 
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారణకు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ మున్సిపల్‌ పట్టణం, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. అనం తరం మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో కరోనా వైరస్‌ నివారణపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  

శనగ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..

సంగారెడ్డి జిల్లాలో రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జహీరాబాద్‌, రాయికోడ్‌, నారాయణఖేడ్‌, వట్‌పల్లి, గుమ్మడిదలలో శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 91 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి టోకెన్‌ తీసుకొని అమ్మకాలు చేసుకోవాలన్నారు. కూరగాయలు పండిస్తున్న రైతులు హైదరాబాద్‌లో అమ్మకాలు చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు పాసులు ఇస్తారని తెలిపారు. రైతులు పంటలకు ఎరువులు, పురుగుల మందుల వేసేందుకు మండల కేంద్రాల్లో షాపులు అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నారాయణఖేడ్‌లో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. రైతులు, కూలీలు సామాజిక దూరం పాటించాలన్నారు. 

సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

జహీరాబాద్‌ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉం దని, అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉం డాలని, ప్రజలు అత్యవసర పరిస్థితిలో 100, 108కు ఫోన్‌ చేయాలన్నారు. ప్రభుత్వం కంట్రోల్‌ రూం ఏర్పా టు చేసిందని, 272525 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌పై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. నిత్యావరస వస్తువుల ధరలు పెంచే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కూలీలకు భోజనం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్కార్‌ దవాఖానకు వచ్చే రోగులకు భోజన సౌకర్యం కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారి చేసేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

సమావేశంలో కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, జహీరాబాద్‌ ఆర్డీవో రమేశ్‌బాబు, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్‌ సీఈవో రవి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నర్సింహారావు, ఉద్యానశాఖ అధికారి సునీత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపూర్‌ శివకుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, జహీరాబాద్‌ డీఎస్పీ గణపత్‌ జాదవ్‌, రైల్వే బోర్డు సభ్యులు షేక్‌ఫరీద్‌, తాసిల్దార్‌ పి.నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో రాములు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, మున్సిపల్‌ ఆర్‌వో ప్రభాకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo