శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Mar 22, 2020 , 23:51:11

జయహో జనతా

జయహో జనతా

  • జిల్లాలో ‘జనతా కర్ప్యూ’ విజయవంతం
  • కర్ణాటక సరిహద్దు వద్ద ట్రావెల్స్‌ బస్సుల నిలిపివేత
  • 39 మందిని క్వారంటైన్‌కు తరలింపు
  • ఉమ్మడి జిల్లాలో నిలిచిన 668 ఆర్టీసీ బస్సులు
  • అత్యవసర సేవల ఉద్యోగులు హాజరు
  • ఇండ్లకే పరిమితమైన నాయకులు, ప్రజలు
  • బంద్‌కు మద్దతుగా చప్పట్లతో సంఘీభావం
  • ఈనెల 31 వరకు కొనసాగనున్న కర్ఫ్యూ
  • రేషన్‌కార్డులో ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం
  • ఒక్కో తెల్లకార్డుకు నిత్యావసరాలకు రూ.1,500 నగదు

జనతా కర్ఫ్యూకు ప్రజలు జేజేలు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఒక్కతాటిపై వచ్చి బంద్‌ పాటించారు. ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను సరిహద్దులో జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి చెక్‌ పోస్టు వద్ద నిలిపివేశారు. ఆయా బస్సుల్లోని 39 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసి హైదరాబాద్‌ క్వారంటైన్‌కు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో 668 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ శాఖల అధికారులకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి ప్రజలు సంఘీభావాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ రాష్ట్రంలో విస్తరించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఈ నెల 31వ తేదీ వరకు బంద్‌ పాటించాలని సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్ర పిలుపునిచ్చారు. జిల్లాలో సరిహద్దులోని చెక్‌ పోస్టులను మూసివేయాలని ప్రకటించారు. అదేవిధంగా అత్యవసరమైతే కుటుంబంలోని ఒక్కరికి బయటికి అనుమతి ఇస్తామని ప్రకటించారు. రేషన్‌కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని, సరుకుల కోసం తెల్ల రేషన్‌ కార్డుదారులకు రూ.1500 నగదును అందజేయనున్నది.  

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి టౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికి కర్ఫ్యూను సక్సెస్‌ చేశారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా బంద్‌ పాటించేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటల్స్‌, వాహనాలు, ఆర్టీసీ బస్సులు జనతా కర్ఫ్యూకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ముంబాయి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను సరిహద్దులో జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న 39 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్‌లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమై బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని 8 డిపోలకు చెందిన 668 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 14 గంటల జనతా కర్ఫ్యూ పాటించి కరోనా వైరస్‌ను నిరోధించాలని ప్రధానిమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఉదయం 6.00 గంటల నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు 24 గంటలు బంద్‌ పాటించి కరోనా వైరస్‌ దరిచేరకుండా నిరోధించాలని కోరారు. దీంతో ప్రజలు ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి ఉదయం నుంచి ప్రజలు బయటకు రాకుండా సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇండ్లకే పరిమితమయ్యారు. బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ శాఖల అధికారులకు సాయంత్రం 5.00 గంటలకు చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని ప్రకటించారు. 

ఈనెల 31వరకు సకలం బంద్‌..

కరోనా వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించి ఈనెల 31 వరకు బందులో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరోనా మహమ్మారిని రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ప్రజలు నిరోదించాలని ఈనెల 31 వరకు సకలం బంద్‌ చేసి వ్యాధి వ్యాప్తిని నివారించాలని కోరారు. అత్యవసర సేవలు అవసరం ఉంటేనే కుటుంబంలోని ఒక్కరికి బయటికి అనుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమితం కావాలని, అప్పుడే వైరస్‌ నివారణకు సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు లాక్‌డౌన్‌ సందర్భంగా 1897 చట్టం ప్రకారం జీతాలు ఇవ్వనున్నారు. అలాగే అత్యవసర సేవల ఉద్యోగులు 100 శాతం విధులకు హాజరుకావాలని, మిగతా ఉద్యోగులు 20 శాతం రొటేషన్‌ పద్ధతిన హాజర య్యేలా విధివిధానాలు ప్రకటించనున్నారు. 

ప్రతి ఒక్కరికి  12 కిలోల బియ్యం..

జిల్లాలో 3.72 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్‌కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి 12 కిలోల చొప్పున ఉచితంగా నెలకు సరిపడా బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయనున్నది. అంతేకాకుండా రేషన్‌కార్డు లబ్ధిదారుడికి నిత్యవసర సరుకుల నిమిత్తం రూ.1500 నగదును అందజేయనున్నది. దీంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం 7 వేల 300 టన్నులు కాగా, విపత్తు కింద 14వేల 600 టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయనున్నది. అలాగే రూ.1500 చొప్పున 3.72 లక్షల రేషన్‌కార్డులకు రూ.55.80 కోట్ల నగదును అందజేయనున్నది. కరోనా వైరస్‌ నివారించడానికి ప్రభుత్వం బారాన్ని మోస్తూ ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడంతోపాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేసేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సరిహద్దుల మూసివేత..

జిల్లాలో ఇతర రాష్ర్టాల సరిహద్దులో ఉన్న చెక్‌ పోస్టులను ఈనెల 31 వరకు మూసి వేయాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో గంగ్వార్‌, చిరాగ్‌పల్లి, నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో దేగుల్‌వాడీ, కరస్‌గుత్తి, మోర్గీ చెక్‌ పోస్టులను మూసివేయనున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలను పూర్తిగా నిషేధించనున్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు, కూరగాయాలు, పాలు సరఫరా చేసే వాహనాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జహీరాబాద్‌లోని చిరాగ్‌పల్లి చెక్‌ పోస్టు వద్ద ముంబాయి నుంచి హైదరాబాద్‌ వస్తున్న రెండు ప్రైవేట్‌ బస్సులను నిలిపివేసి అందులో ప్రయాణిస్తున్న 39 మంది ప్రయాణికులను హైదరాబాద్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. 


logo