గురువారం 04 జూన్ 2020
Sangareddy - Mar 21, 2020 , 23:19:53

పది పరీక్షలకు బ్రేక్‌

పది పరీక్షలకు బ్రేక్‌

  • శనివారం సజావుగా జరిగిన పరీక్ష
  • 21925 మంది విద్యార్థులు హాజరు
  • 47 మంది గైర్హాజరు
  • హాజరు శాతం 99.79 శాతంగా నమోదు
  • హైకోర్టు ఆదేశాలతో మిగిలిన పరీక్షలు వాయిదా

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరిగాయి. శనివారం జిల్లాలో 21,925 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 47 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో 99.79 శాతం నమోదైనట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. మొత్తం జిల్లాలో 21,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 47 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించడంతో పదో తరగతి  పరీక్షలు వాయిదా వేయాలని  హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి జరుగాల్సిన  పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేస్తుందని కోర్టు ఇచ్చిన ఆదేశాలలో ప్రకటించింది. ప్రభుత్వానికి జారీ చేసిన ఉత్తర్వుల్లో కరోనా వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తలు పాటించాలని, పది పరీక్షలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 6 వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజులు జరిగిన పరీక్షల్లో విద్యార్థులు గైర్హాజరు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను బయటి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచాలని, పరీక్షల్లో భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని సూచించారు. 

అధికారుల తనిఖీ..

జిల్లాలో రిజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మీబాయి, సంగారెడ్డి, రామచంద్రాపూర్‌ ప్రాంతాల్లోని 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే, జిల్లా విద్యాధికారి రాజేశఖ పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపూర్‌ ప్రాంతాల్లో 5 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మాస్‌ కాపింగ్‌కు తావివ్వకుండా 40 మంది ఫ్లయింగ్‌ స్వాడ్‌ అధికారుల బృందం పరీక్ష కేంద్రాలను సందర్శించారు. శనివారంతో పది పరీక్షలకు విద్యార్థులు ముగింపు పలికారు. పరీక్షలు పూర్తి కాకపోవడం కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడడంతో విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వుకు బదులు బాధ కనిపించినట్లు ముఖాలు వాడిపోయాయి. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఆందోళనతో విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. 


logo