ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Mar 21, 2020 , 23:17:33

కర్ఫ్యూను పాటిద్దాం కరోనాను జయిద్దాం

కర్ఫ్యూను పాటిద్దాం కరోనాను జయిద్దాం

  • ఇంటిలో ఉండడమే సమాజానికి మనం చేసే సేవ
  • విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం అందించాలి
  • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం సాగిద్దాం
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కర్ఫ్యూను 24 గంటలు పాటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వీయ పరిశుభ్రత పాటించాలని, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. 24 గంటలకు అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, ఇతర వస్తువులు ముందే సమకూర్చుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా రోడ్ల మీదకు రాకుండా ఉద్యమ స్ఫూర్తిని చాటాలన్నారు. సరైన స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే పలు దేశాల్లో కరోనా విజృంభించి ప్రజల ప్రాణాలను కబళిస్తోందన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ నిరంతరం కరోనా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. అనేక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ వైరస్‌ను అరికట్టగలమన్నారు. ఎవరికి వారు సబ్బుతోనే, శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే వైద్యులను సంప్రదించాలని, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఆదివారం ఇంటిలో ఉండడమే మనం సమాజానికి చేసే సేవ అని మంత్రి చెప్పారు. కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చే వారి నుంచే వస్తుందని, విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. రేపటి జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ద్వారా తెలంగాణ ఐక్యత చాటిచెప్పడంతో పాటు కరోనా వ్యాప్తిని నివారించవచ్చునని మంత్రి హరీశ్‌రావు పిలువునిచ్చారు.


logo