శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Mar 21, 2020 , 00:29:15

‘పది’లం బిడ్డా..

‘పది’లం బిడ్డా..

  • పదో తరగతి విద్యార్థిని పరీక్షపై హైరానా 
  • కరోనా భయంతో పంపించని తల్లిదండ్రులు 
  • పోలీసులకు సమాచారమిచ్చిన ప్రిన్సిపాల్‌ 
  • అధికారుల సాయంతో పరీక్షకు విద్యార్థిని
  • తల్లిదండ్రులకు అపోహలు తొలిగేలా కౌన్సెలింగ్‌ 

రామచంద్రాపురం: కరోనా ప్రజల పాలిట మహమ్మారిగా మారుతున్నది. ప్రభుత్వం ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తూనే, ఎవరి దరిచేరకుండా పలు చర్యలు చేపడుతున్నది. కాగా కొందరు అవగాహన లేమితో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనే శుక్రవారం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకున్నది. మున్సిపల్‌ పరిధిలోని ఇన్‌ఫినిటీ హోమ్స్‌లో తూర్పుగోదావరి జిల్లా వాసి వెంకటేశ్వర్లు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మూడు ఏండ్ల క్రితం కుటుంబంతో తెల్లాపూర్‌కు వచ్చారు. అతడి కూతురు దుర్గాభవానీ తెల్లాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నది. కాగా, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండడంతో దుర్గాభవానీ పరీక్ష రాయడం లేదు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులను వారి ఇంటికి పంపించారు. అయితే ఉపాధ్యాయులు ఎంత చెప్పినా విద్యార్థి తల్లిదండ్రులు కరోనా వైరస్‌కు భయపడి వారి కూతురును పరీక్షలు రాయడానికి పంపించమని చెప్పారు. దీంతో వారు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ రమాదేవికి చెప్పడంతో ఆమె డీఈవో రాజేష్‌, ఎంఈవో జెమినికుమారి, పోలీసులకు సమాచారం అందించారు. డీఈవో సూచనతో ఎంఈవో జెమినికుమారి విద్యార్థిని తల్లిదండ్రులను పోలీస్టేషన్‌ వద్దకు తీసుకువచ్చి అక్కడ కౌన్సెలింగ్‌ చేశారు. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షలు రాయకున్నా పర్వాలేదు కాని మా బిడ్డకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని విద్యార్థిని తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నించారు. పరీక్షలు రాయకపోతే విద్యార్థినికి భవిష్యత్‌ ఉండదని, మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని వారికి అర్థమయ్యేలా చెప్పి విద్యార్థినిని పరీక్ష రాయించడానికి తీసుకువెళ్లారు. అప్పటికీ ఆలస్యమైనా అధికారులు ప్రత్యేకంగా విద్యార్థిని చేత పరీక్ష రాయించారు.

పరీక్ష కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం

  • ఎంఈవో జెమినికుమారి

పది పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులను ఏర్పాటు చేశాం. మాస్క్‌లను ధరించాలని సూచించిస్తున్నాం. ఇన్విజిలేటర్లు వ్యక్తిగత శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శుభ్రంగా ఉంచుతున్నాం. విద్యార్థులకు వ్యక్తిగత జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. విద్యార్థులు స్వేచ్ఛగా పరీక్షలకు హాజరుకావాలి. తల్లిదండ్రులు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. పిల్లలను పరీక్షలు రాయనివ్వండి. విద్యాశాఖ సూచనల మేరకు పరీక్ష కేంద్రాల్లో అన్నివిధాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

కరోనా సోకుతుందని బయటకు రావడంలేదు..

  • విద్యార్థిని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కుమారి

కరోనా సోకుతుందని భయంతో నాలుగు రోజులుగా ఇంట్లో నుంచి భయటకు వెళ్లడంలేదు. అసలే భయట వాతావరణం సరిగ్గా లేదు. ఏవైనా వ్యాధులు సోకితే దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోలేని పరిస్థితి మాది. పరీక్షలు ఇప్పుడు కాకున్నా తర్వాతనైనా రాసుకోవచ్చు, కానీ ఆరోగ్యం ముఖ్యం కదా అని పరీక్షలు రాసేందుకు మా బిడ్డను పంపలేదు. అధికారులకు ఈ విషయం తెలిసి తమ వద్దకు వచ్చి కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పరీక్షలు రాయకుంటే తమ బిడ్డ భవిష్యత్‌ బాగుండదని అధికారులు చెప్పి దుర్గభవానిని పరీక్ష రాయించేందుకు తీసుకువెళ్లారు. ఇకమీదట మా బిడ్డను పరీక్షలు రాసేందుకు పంపిస్తాం. logo