మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Mar 21, 2020 , 00:17:48

కరోనా కట్టడి కట్టుదిట్టం

కరోనా కట్టడి కట్టుదిట్టం

  • కలెక్టరేట్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు 
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
  • విదేశాల నుంచి వచ్చేవారి సమాచారం సేకరణ 
  • జిల్లా సరిహద్దులో స్క్రీనింగ్‌ శిబిరాలు
  • రేపు జనతా కర్ఫ్యూ పాటించాలి
  • మాస్క్‌లు, నిత్యావసరాలు ‘బ్లాక్‌' చేస్తే చర్యలు  
  • కలెక్టర్‌ హనుమంతరావు నెలాఖరు వరకే పెండ్లిళ్లకు అనుమతి 
  • ఆపై ఫంక్షన్‌ హాళ్లు ఇస్తే కేసులు నమోదు 
  • ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి 

కరోనా వైరస్‌ కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సమాచారం సేకరించి, హౌస్‌ క్వారంటైన్‌ చేసి పరిశీలిస్తున్నారు. వైద్య సేవలు అవసరమయ్యే వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, శుక్రవారం ఐఐటీ క్యాంపస్‌ బోసిపోయి కనిపించింది. అదేవిధంగా ఫంక్షన్‌ హాళ్లలో పెండ్లిళ్లకు ఈ నెలాఖరు వరకే అనుమతిచ్చారు. ఆ తరువాత పెండ్లిళ్లకు ఫంక్షన్‌హాల్‌ ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే రేపటి జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్‌ హనుమంతరావు పిలుపునిచ్చారు. 

సంగారెడ్డి అర్బన్‌, జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా... ఈ పేరు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌. రాష్ట్రంలో కూడా ఈ వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నది. విదేశాల నుంచి వస్తున్నవారిని అధికారులు పరీక్షించి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన 65వ జాతీయ రహదారిపై జహీరాబాద్‌ సమీపంలో చెరాగ్‌పల్లి, బీదర్‌ రోడ్డుపై గంగ్వార్‌ చౌరస్తా వద్ద ప్రభుత్వ యంత్రాంగం రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బయట నుంచి ప్రతి బస్సును నిలిపి ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు రెవెన్యూ అధికారులు సేకరించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇంటికే పరిమితం చేస్తున్నారు. జహీరాబాద్‌లో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిపిస్తున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి

కంగ్టి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కంగ్టి తహసీల్దార్‌ నాగరాజు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని దెగుల్‌వాడీ గ్రామ సమీపంలో వైద్యాధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న అన్ని వాహనాల్లోని ప్రయాణికులకు స్క్రీనింగ్‌ చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో జైసింగ్‌, ప్రభుత్వ వైద్యాధికారి మనోహర్‌రెడ్డి, ఆయూస్‌ వైద్యాధికారి నారాయణరావు తదితరులున్నారు. 

కరోనాపై వాట్సాప్‌ హెల్ప్‌డెస్క్‌

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ/రామచంద్రాపురం: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా బాధితులకు సాయం అందించేందుకు ప్రభుత్వం వాట్సాప్‌ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించింది. శుక్రవారం కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సంబంధాల శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి కిరణ్‌కుమార్‌, తెల్లాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట మణికరణ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మై గవర్నమెంట్‌ కరోనా హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌: 9013151515కు బాధితులు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే హెల్ప్‌డెస్క్‌ సభ్యులు బాధితుడిని దవాఖానలో చేర్పించి పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

క్యాంపస్‌ ఖాళీ...

కంది: నిత్యం విద్యార్థులతో కిటకిటలాడే ఐఐటీ క్యాంపస్‌ ప్రస్తుతం బోసిపోయింది. కరోనా వైరస్‌ దెబ్బకి ఇక్కడ ఉన్న విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్‌ బీ.ఎస్‌.మూర్తి ఆదేశాల మేరకు ఐఐటీ క్యాంపస్‌ను ఈ నెల 29 వరకు విడిచి వెళ్లాలని సూచించారు. దీంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పెట్టా, బేలా చేతపట్టి ఇండ్లకు వెళ్లిపోవడంతో శుక్రవారం ఐఐటీ క్యాంపస్‌ బోసిపోయినట్లు అయ్యింది. కరోనా వైరస్‌ ధాటికి ఎప్పుడూ చూడని సన్నివేశం ఇప్పుడు చూడాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న కొద్ది మంది స్టాఫ్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.  

పెండ్లిలో మాస్క్‌లు..

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: అందంగా ముస్తాబై పెండ్లి పీటలెక్కాల్సిన వధూవరులు కరోనా వైరస్‌ కారణంగా మాస్క్‌లు ధరించి పెండ్లి చేసుకున్నారు. నారాయణఖేడ్‌ మండలం చల్లగిద్ద తండాలో శుక్రవారం జరిగిన పెళ్లి వేడుకలో నవదంపతులతో సహా పలువురు బంధువులు సైతం మాస్క్‌లు ధరించి పెళ్లి వేడుకలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. కరోనా వైరస్‌పై ప్రజల్లో పెరిగిన అవగాహనకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ పెళ్లి వేడుకకు ఎంపీపీ చాందిబాయి చౌహాన్‌, బంజరా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌చౌహాన్‌, సర్పంచ్‌ సుశీల, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌ సింగ్‌లు పాల్గొని వారిని అభినందించారు.

అలర్ట్‌గా ఉండాలి

  • జిల్లా దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును పరిశీలించిన జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి

సంగారెడ్డి మున్సిపాలిటీ: కరోనాపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కరోనా (కొవిడ్‌-19) ఐసోలేషన్‌ వార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ ప్రజలు జన సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కరోనా అనుమానితుల కోసం, కొవిడ్‌-19 చికిత్సల కోంస జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూరింటెండెంట్‌ డాక్టర్‌.సంగారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లత, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.logo