గురువారం 04 జూన్ 2020
Sangareddy - Mar 19, 2020 , 23:15:02

హై అలర్ట్‌

హై అలర్ట్‌

  • ఎక్కడికక్కడ కరోనా కట్టడికి చర్యలు
  • ఇప్పటికే జిల్లా దవాఖానలో ప్రత్యేక వార్డు
  • పటాన్‌చెరు మహేశ్వర, టీఆర్‌ఆర్‌ కళాశాలల్లో క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డులు
  • రెండు చోట్ల కలిపి 700 వరకు బెడ్లు
  • విదేశాల నుంచి వచ్చే వారిని నేరుగా ఇక్కడికి తరలించేలా ఏర్పాట్లు
  • మహారాష్ట్ర, కర్ణాటక చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
  • ఐఐటీలో షట్‌డౌన్‌, క్యాంపస్‌ ఖాళీ చేయాలని విద్యార్థులకు ఆదేశం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఫంక్షన్‌ హాళ్లను మూసివేయించిన సర్కార్‌, తాజాగా అధికారులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జిల్లా దవాఖానతో పాటు ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో  క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులోనూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తున్నారు. గురువారం జహీరాబాద్‌ చెరాగ్‌పల్లి చెక్‌పోస్ట్‌ వద్ద వైద్య శాఖ ఏర్పాటు చేసిన ‘స్క్రీనింగ్‌'ను ఎమ్మెల్యే మాణిక్‌రావు స్వయంగా పరిశీలించారు. ఇదిలా ఉంటే కంది ఐఐటీ క్యాంపస్‌కు ఈ నెల 29 వరకు సెలవులు ప్రకటించారు. అదే విధంగా గీతం, ఐఐటీల్లో నూతన శానిటైజర్లను తయారు చేశారు.

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రోజురోజుకూ కరోనా ఉధృతమవుతున్న నేపథ్యం లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైం ది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి, మాల్స్‌, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లను మూసివేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 13కు పెరుగడంతో  అందరినీ అప్రమత్తం చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలో 6 బెడ్లతో కూడిన ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయ గా, తాజాగా పటాన్‌చెరులోని మహేశ్వర, టీఆర్‌ఆర్‌ కళాశాల్లో 700 బెడ్లతో కూడిన ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తరలించనున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా ప్రయాణికులకు ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తున్నారు. 

కంది ఐఐటీలో షట్‌డౌన్‌ ప్రకటించారు. దాదాపు 2వేల మంది విద్యార్థులను తక్షణమే కళాశాల విడిచి వెళ్లాలని యాజమాన్యం ఆదేశించింది. కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని  కలెక్టర్‌ హనుంమంతరావు సూచించారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే తప్పుడు పుకార్లను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

వైరస్‌ నిరోధానికి గీతం శానిటైజర్‌

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నిరోధానికి గీతం ప్రొఫెసర్ల బృందం శానిటైజర్‌ను తయారు చేశారు. గురువారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రొఫెసర్లు కరోనా (కోవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి గాను చేతులను శుభ్రపరుచుకునే ద్రవాన్ని, అందుబాటులో ఉన్న వనరులతో తయారు చేసి ఔరా అనిపించుకున్నారు. స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.శివకుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ రాకేశ్‌ బారిక్‌, డాక్టర్‌ సినాయ్‌ సుగుణన్‌ల బృందం ఫార్మసీ ల్యాబరేటరీలో శానిటైజర్‌ను తయారు చేసి విశ్వవిద్యాలయం ప్రతినిధుల ప్రశంసలు పొందారు. ఐసో ప్రొఫైల్‌ ఆల్కహాల్‌ 70శాతం, గ్లిజరిన్‌ మూడు శాతం, ఆరెంజ్‌ ఆయిల్‌ రెండు శాతం నిష్పత్తిలో కలిపి ద్రవాన్ని తయారు చేశారు. అది విశ్వవిద్యాలయంలోని పలు ప్రదేశాల్లో పెట్టి, ప్రతిఒక్కరూ తరచుగా చేతులను శుభ్రపరుచుకునే వీలు కల్పించారు. మార్కెట్‌లో లభ్యత తగ్గిన సమయంలో గీతం ప్రొఫెసర్లు తయారు చేసిన శానిటైజర్లు ఎంతో మేలు చేస్తున్నాయి. ప్రొఫెసర్ల బృందాన్ని గీతం హైదరాబాద్‌ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్‌ ఏ శ్రీరామ్‌ తదితరులు అధ్యాపక బృందాన్ని అభినందించారు.

అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి 

కరోనా వైరస్‌ను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సూచనలు, సలహాలు చేస్తున్నది. ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఫంక్షన్లు, ఇతర శుభకార్యాలను రద్దు చేసుకోవాలి. వృద్ధులు, పిల్లల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జల్లాలో అన్ని శాఖలను అప్రమత్తం చేశాం. గ్రామాల్లోని విద్యావంతులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి.            - హనుమంతరావు, కలెక్టర్‌ 

పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

కరోనాపై ఇష్టం వచ్చినట్లు సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియాలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశాం. జోగిపేటకు చెందిన ముగ్గురు సోషల్‌ మీడియా వేదికగా కరోనాపై తప్పుడు ప్రచారం చేసినట్లు విచారణలో తేలడంతో కేసులు పెట్టాం. కరోనాను అరికట్టడంలో భాగంగా రాష్ట్ర సరిహద్దులోని జహీరాబాద్‌ వద్ద ఆర్టీఏ, పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి తగు సూచనలు చేస్తున్నారు.

- చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ

ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి 

ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యు లు ఎక్కడికీ ప్రయాణాలు పెట్టుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిన వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో వైద్య బృందం అప్రమత్తంగా ఉన్నది.  ఇప్పటికే జిల్లా దవాఖానలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇతర దేశాల నుంచే వచ్చే వారికోసం పటాన్‌చెరులో 700 బెడ్లతో ప్రత్యేక కేం ద్రాలు సిద్ధం చేశారు. వివిధ దేశాల నుంచి ఇటీవల జిల్లాకు 68 మంది వరకు వచ్చినట్లు గుర్తించాం. వారంతా బాగానే ఉన్నట్లు తమ పరిశీలనలో తేలింది.  

- మోజీరాం రాథోడ్‌, జిల్లా వైద్యాధికారి


logo